ఆ ఒప్పందం ముగిసింది : ట్రంప్‌

21 Oct, 2018 15:37 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా, రష్యా దేశాల మధ్య ఉన్న ఇంటర్మీడియట్‌ రేంజ్‌ న్యూక్లియర్‌ ఫోర్సెస్‌ ట్రీటీ- ఐఎన్‌ఎఫ్‌(మధ్యస్థాయి అణ్వాయుధాల ఒప్పందం) ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇరుదేశాల అంగీకారంతో ఈ ఒప్పందం కుదిరింది.. కానీ రష్యా ప్రతీసారి అందులోని నిబంధనలు ఉల్లంఘిస్తోందని ట్రంప్‌ ఆరోపించారు. కేవలం ఈ కారణంగానే ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఒబామా ఎందుకలా చేశారో?
‘రష్యా ప్రవర్తించిన తీరు కారణంగా ఈ ఒప్పందం ఎప్పుడో రద్దు అవ్వాల్సింది. కానీ ఒబామా దీనిని ఎందుకు కొనసాగించారో నాకైతే తెలియదు. మేము ఈ ఒప్పందంలోని ప్రతీ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాం. రష్యాకు ఇకముందు ఎటువంటి అవకాశం ఇవ్వదల్చుకోలేదు. అణ్వాయుధాల విషయంలో అమెరికా చాలా జాగరూకతతో వ్యవహరిస్తోంది. కాబట్టి ఈ ఒప్పందంలో ఇకపై అమెరికా ఒక్కటే కొనసాగుతుంది. ఎందుకంటే మేము ఐఎన్‌ఎఫ్‌ను గౌరవిస్తున్నాం. దురదృష్టవశాత్తు రష్యా అలా చేయలేకపోయింది. ఇంతటితో ఇది ముగిసింది’ అంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న సమయంలో..
ప్రపంచంపై ఆధిపత్యం సంపాదించేందుకు, అగ్ర రాజ్య హోదా పొందేందుకు అమెరికా, రష్యాలు పోటాపోటీగా అణ్వాయుధాలు తయారు చేస్తున్న సమయంలో... యూరోపియన్‌ కూటమిలోని దేశాల రక్షణకై ఇరుదేశాలు ఐఎన్‌ఎఫ్‌ అనే చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఓవైపు ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తూనే.. అణ్వాయుధాలను ప్రపంచం నుంచి తొలగించాలని భావిస్తున్నామంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌, అప్పటి యూఎస్‌ఎస్‌ఆర్‌ అధ్యక్షుడు మైఖేల్‌ గోర్బచ్ఛేవ్‌ 1987, డిసెంబరులో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. మధ్యస్థాయి, చిన్న తరహా క్షిపణులను నిర్మూలించడం ఈ  ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఐఎన్‌ఎఫ్‌ ద్వారా  1991,మే నాటికి సుమారు 2,692 క్షిపణులు, వాటి లాంచర్లను, మరికొన్ని సంప్రదాయ క్షిపణులకు ఇరుదేశాలు ముగింపు పలికాయి. అయితే ట్రంప్‌ అధికారంలోకి వచ్చిననాటి నుంచి రష్యా ఈ ఒప్పందానికి తూట్లు పొడుస్తుందంటూ ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల్లో దీనికి ప్రముఖ స్థానం ఉందంటూ విమర్శించారు.

కాగా 2014లో ఉక్రెయిన్‌ నుంచి క్రిమియాను హస్తగతం చేసుకోవడం, సిరియా అంతర్యుద్ధంలో ప్రమేయం, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను శిక్షించేందుకు కాట్సా (కౌంటరింగ్‌ అమెరికాస్‌ అడ్వర్‌సిరీస్‌ థ్రూ శాంక్షన్స్‌ యాక్ట్‌ ) చట్టాన్ని అమెరికా గత ఆగస్టులో ఆమోదించింది. రష్యాతో రక్షణ, నిఘారంగాల్లో వ్యాపారం చేసే దేశాలపై ఆటోమెటిక్‌గా ఆంక్షలు విధించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుందని గతంలోనే అమెరికా హెచ్చరించింది. అయితే చైనా, పాకిస్తాన్‌లను నిలువరించాలంటే భారత్‌కు...ఎస్‌- 400 ట్రయంఫ్‌ క్షిపణి వ్యూహాత్మక అవసరంగా మారింది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి ఎస్‌- 400 ట్రయంఫ్‌ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందంపై స్పందించిన ట్రంప్‌.. ‘భారత్‌కు త్వరలోనే తెలుస్తుంది. మీరే చూస్తారుగా.. మీరు ఊహించడానికి ముందే’  అంటూ చేసిన వ్యాఖ్యానించారు. అయితే రష్యాతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసిన ట్రంప్‌... భారత్‌ పట్ల ఎటువంటి వైఖరి ప్రదర్శిస్తారో అనే అంశం ప్రస్తుతం చర్చనీయంగా మారింది.

మరిన్ని వార్తలు