ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా

10 May, 2018 02:51 IST|Sakshi

సంచలన నిర్ణయం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు

ట్రంప్‌ నిర్ణయం విచారకరమన్న ఒప్పందంలోని ఇతర దేశాలు

వాషింగ్టన్‌: ఏడు దేశాలు రెండేళ్లపాటు చర్చోపచర్చలు జరిపిన తర్వాత 2015లో సాకారమైన చారిత్రక ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి వైదొలుగుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌ అణ్వాయుధాలు ఉత్పత్తి చేయకుండా నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలో కుదిరిన ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీవోఏ)ను ‘క్షీణించిన, కుళ్లినది’గా అభివర్ణించే ట్రంప్‌.. తాను అధికారంలోకి వస్తే ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తానని 2016లో ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారు.

చెప్పినట్లుగానే జేసీపీవోఏ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు మంగళవారం ట్రంప్‌ ప్రకటించారు. తననిర్ణయంతో అమెరికా మిత్రదేశాలతోనూ విభేదాలు తెచ్చుకున్నారు. అమెరికాతో సంబంధం లేకుండా తాము ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటామనీ, ఇరాన్‌ కూడా అలాగే చేయాలని ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, చైనా, జర్మనీ ప్రకటించాయి. ఇరాన్‌ అణు కార్యక్రమాలపై ఆంక్షలు విధించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలతోపాటు జర్మనీ కూడా కలసి ఇరాన్‌తో రెండేళ్లపాటు చర్చలు జరిపిన అనంతరం 2015లో వియన్నాలో జేసీపీవోఏ ఒప్పందం కుదరడం విదితమే.

అణు కార్యక్రమాలను నిలిపివేసినందుకుగాను అప్పటివరకు ఇరాన్‌పై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తేశారు. ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ద్వారా ఈ ఒప్పందాన్ని అంతర్జాతీయ చట్టంగా కూడా గుర్తించారు. ‘మనం ఇరాన్‌ అణు బాంబును నియంత్రించలేమనేది నాకు స్పష్టంగా తెలుసు. ఈ ఒప్పందం మూలంలోనే లోపాలు ఉన్నాయి. కాబట్టే దీని నుంచి అమెరికా తప్పుకుంటున్నదని నేను ప్రకటిస్తున్నాను’ అని ట్రంప్‌ చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించారు.

ట్రంప్‌ నిర్ణయ ప్రభావమెంత?
అమెరికాప్రకటించిన ఆంక్షలు ఇరాన్‌ ఆటోమొబైల్‌ రంగంపై మూడు నెలల తర్వాత, చమురు రంగంపై ఆరు నెలల తర్వాత అమల్లోకి వస్తాయి. కాబట్టి అంతర్జాతీయ చమురు ధరలు వేగంగా పెరిగే అవకాశాల్లేవు. అమెరికా మిత్ర దేశాలు అనేకం ఇరాన్‌ నుంచి ముడి చమురు కొంటున్న నేపథ్యంలో అవి అమెరికాను అనుసరిస్తూ కొనుగోళ్లు తగ్గించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఈ మిత్రదేశాల బ్యాంకులపై అమెరికా ఆరు నెలల తర్వాత ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది. అందుకే అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఐరోపా మిత్రదేశాలు కోరుతున్నాయి. ట్రంప్‌ నిర్ణయం వల్ల మిత్ర దేశాలైన ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీలు అమెరికాకు దూరమయ్యే అవకాశం కూడా లేకపోలేదు.

భారత్‌పై తక్షణ ప్రభావం ఉండదు: ఇరాన్‌పై అమెరికా పునరుద్ధరించిన ఆర్థిక ఆంక్షలను ఐరోపా దేశాలు పాటించనంత వరకు భారత ముడిచమురు దిగుమతులపై ప్రభావం ఉండదని భారత అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు