ఉత్తర కొరియాలో ట్రంప్‌

1 Jul, 2019 03:19 IST|Sakshi
కొరియాల సరిహద్దులోని పన్‌మున్‌జోం గ్రామంలో సమావేశమైన కిమ్, ట్రంప్‌

నిస్సైనిక మండలంలో అధ్యక్షుడు కిమ్‌ ఉన్‌తో భేటీ

‘అణు’ చర్చల ప్రారంభానికి అంగీకారం

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ను కలిసిన ట్రంప్‌

ట్రంప్‌ పర్యటనపై దక్షిణ కొరియాలో మిశ్రమ స్పందన

పన్‌మున్‌జొమ్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం ఉత్తర కొరియా వచ్చారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జంగ్‌ ఉన్‌తో సమావేశమయ్యారు. ఉభయ కొరియాల సరిహద్దుల మధ్య ఉన్న నిస్సైనిక మండలం(డీఎంజెడ్‌)లోని పన్‌మున్‌జొమ్‌ గ్రామంలో ఇరువురు నేతలు కలుసుకున్నారు. పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా రావడం ఇదే మొదటిసారి కావడంతో ట్రంప్‌ పర్యటన చరిత్రాత్మకమయింది. ఉత్తర కొరియాలో అడుగుపెట్టిన ట్రంప్‌ ఆ దేశాధ్యక్షుడు కిమ్‌తో కలిసి నిస్సైనిక మండలంలోకి వచ్చారు.

అక్కడ కాసేపు మాట్లాడుకున్నారు. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమంపై చర్చలు మొదలు పెట్టేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు. కాగా ట్రంప్‌ ఉత్తర కొరియా పర్యటనపై దక్షిణ కొరియాలో భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు దీనిపై ఆశాభావం వ్యక్తం చేయగా, మరికొందరు దీనిని వ్యర్థ ప్రయత్నంగా పేర్కొన్నారు. కిమ్‌ను అమెరికాకు ఆహ్వానించినట్టు ట్రంప్‌ తెలిపారు. ఆయన రావాలనుకుంటే ఏప్పుడయినా అధ్యక్ష భవనానికి రావచ్చని కిమ్‌కు చెప్పినట్టు ట్రంప్‌ వెల్లడించారు.

ఉత్తర కొరియా రమ్మనడం నాకు గౌరవకారణం. అలాగే, నేను ఉత్తర కొరియాలో అడుగుపెట్టడం నాకు గర్వకారణం’అని ట్రంప్‌ ఉత్తర కొరియా అధినేతతో అన్నారు. చర్చలకు కూర్చుంటూ ఇద్దరు నేతలూ కరచాలనం చేసుకున్నారు. ఉత్తర, దక్షిణ కొరియాల విభజనకు గుర్తుగా నిలిచిన ఈ ప్రాంతంలో మేం చేసుకున్న కరచాలనం గతాన్ని మరిచిపోవాలన్న మా ఆకాంక్షకు నిదర్శనం’ అని కిమ్‌ అన్నారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఈ ఇద్దరు నేతలు కలుసుకోవడం జరిగింది.

ట్రంప్‌ శనివారం ట్విట్టర్‌లో ఉత్తర కొరియా అధినేత కిమ్‌కు ఆహ్వానం పంపారు. ఆదివారం వారిద్దరూ సమావేశమయ్యారు. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమం అంతర్జాతీయంగా ఆందోళనకు దారి తీస్తున్న నేపథ్యంలో అణ్వాయుధాలకు స్వస్తి చెప్పేలా ఉత్తర కొరియాను ఒప్పించడానికి ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గత ఏడాది సింగపూర్‌లో రెండు దేశాల అధినేతలు సమావేశమయ్యారు. అది విఫలమయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్, కిమ్‌లు వియత్నాంలో మళ్లీ చర్చలు జరిపారు.

ఆ చర్చలు కూడా ఫలప్రదం కాలేదు. 2017లో ఉత్తర కొరియా ఆరు అణు పరీక్షలను నిర్వహించింది. అమెరికాను చేరుకోగల  క్షిపణులను పరీక్షించింది.  గత ఏడాది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జయేల మధ్య నిస్సైనిక మండలంలో మొదటి సారి సమావేశం జరిగింది. ఉత్తర కొరియా, అమెరికాల మధ్య సయోధ్య కుదర్చడానికి మూన్‌ ప్రయత్నించారు.దానికి కొనసాగింపుగా ట్రంప్‌ ఇప్పుడు ఉత్తర కొరియాలో అడుగు పెట్టారు. ట్రంప్‌ కిమ్‌తో పాటు దక్షిణ కొరియా అధ్యక్షుడిని కూడా కలుసుకున్నారు.

అణు చర్చలకు మార్గం సుగమం
ట్రంప్‌ ఉత్తర కొరియా పర్యటనపై దక్షిణ కొరియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య స్తంభించిపోయిన అణు చర్చలు పునః ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొందరంటోంటే, వియత్నాం చర్చల్లాగే ఈ పర్యటన వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని మరి కొందరు పెదవి విరుస్తున్నారు. త్వరలో ఎన్నికలు ఎదుర్కొనున్న ట్రంప్, మూన్‌లు ఇద్దరు రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పని చేశారని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు