కరోనాని కట్టడి చేస్తున్నామన్న ట్రంప్‌

15 Apr, 2020 03:06 IST|Sakshi
న్యూయార్క్‌లోని లాంగోన్‌ మెడికల్‌ సెంటర్‌లో రోగిని∙తరలిస్తున్న దృశ్యం

ప్రపంచవ్యాప్తంగా లక్షా 20వేలు దాటిన మృతులు

వాషింగ్టన్‌/లండన్‌/మాడ్రిడ్‌: కరోనా రక్కసి కొమ్ములు విరిచేయడంలో తాము చేస్తున్న కృషి ఫలిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. తమ ప్రభుత్వం సరైన దిశలోనే అడుగులు వేస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య తగ్గు ముఖం పడుతోందని అన్నారు. ‘కరోనాపై చేస్తున్న పోరాటంలో పురోగతి సాధిస్తున్నాం. న్యూయార్క్, న్యూజెర్సీ, మిషిగాన్, లూసియానాలో కేసుల తీవ్రత తగ్గింది’ అని చెప్పారు. గత కొద్ది రోజులుగా అమెరికాలో రోజుకి 30 వేల కొత్త కేసులు నమోదైతే, ఇప్పుడు వాటి సంఖ్య 25 వేలకు తగ్గింది. అదే విధంగా 24 గంటల్లో 2 వేలమందికి పైగా మృతి చెందితే, ఇప్పుడు మృతుల సంఖ్య 1300కి తగ్గింది. 

మార్కెట్లు తెరవడంపై నిర్ణయం
కరోనా ఉక్కు పిడికిలిలో చిక్కుకొని విలవిలలాడుతున్న అగ్రరాజ్యంలో ఆంక్షలు ఎత్తివేసి ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఎప్పుడు కొనసాగించాలన్న అంశంలో అధ్యక్షుడు ట్రంప్, వివిధ రాష్ట్రాల గవర్నర్ల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ అంశంలో అధ్యక్షుడిదే తుది నిర్ణయమని, మార్కెట్లు ఎప్పుడు తెరవాలో త్వరలోనే వెల్లడిస్తామని ట్రంప్‌ చెబుతుంటే, కొన్ని రాష్ట్రాల గవర్నర్లు విభేదిస్తున్నారు. తమ రాష్ట్రాల్లో కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తామే ఆ పని చేస్తామని అంటున్నారు. అలా వ్యాఖ్యానించిన గవర్నర్లలో డెమొక్రాట్లతో పాటుగా రిపబ్లికన్లు ఉన్నారు. దీనిపై ట్రంప్‌ ట్విట్టర్‌ వేదికగా స్పష్టతనిచ్చారు. ‘వాణిజ్య కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడం గవర్నర్ల చేతుల్లో ఉంటుందని కొందరు చెబుతున్నారు. కానీ అది సరైనది కాదు. అధ్యక్షుడే అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకొని నిర్ణయం తీసుకుంటాడు. ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌  పాటించాలి’అని అన్నారు. 

స్పెయిన్‌లో పాక్షికంగా లాక్‌డౌన్‌ ఎత్తివేత
స్పెయిన్‌లో సోమవారం నుంచి పాక్షికంగా లాక్‌డౌన్‌ ఎత్తివేశారు. నిర్మాణ, తయారీ రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిచ్చారు. పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకొని కార్మికులు విధులకు హాజరయ్యారు. పబ్లిక్‌ ప్లేస్‌లు, పార్కులు, రెస్టారెంట్లు, బార్లు మాత్రం లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి. ఏప్రిల్‌ 25వరకు ఈ లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. 
► ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో ఎన్నికలకు వెళుతున్న తొలిదేశంగా దక్షిణ కొరియా వార్తల్లో నిలిచింది. నేషనల్‌ అసెంబ్లీలో 300 స్థానాలకు బుధవారం పోలింగ్‌ జరగనుంది. కరోనా కట్టడి, ఆర్థిక స్థితిగతులు ఎన్నికల అంశంగా మారాయి. 
► కేసులు అదుపులోకి వస్తే మే 11 నుంచి ఆంక్షలు ఎత్తివేస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ ప్రకటించారు. 
► రష్యాలో మంగళవారం 2,774 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 21వేలు దాటిపోయింది. 
► రష్యా సరిహద్దుగా ఉండే చైనా ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 89 కొత్త కేసులు నమోదయ్యాయి. 

మోదీ నిర్ణయం భేష్‌ : డబ్ల్యూహెచ్‌ఓ
లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించింది. ‘భారత్‌లో కరోనా కేసులు ఎంతవరకు తగ్గుముఖం పడతాయో ఇప్పట్నుంచో చెప్పలేంగానీ దేశం ఆరువారాల పాటు లాక్‌డౌన్‌లో ఉండడం వల్ల ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తా రని, దీని వల్ల వ్యాప్తిని నిరోధించవచ్చు’అని డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రాపాల్‌ సింగ్‌ అన్నారు. ఎన్నో రకాల సవాళ్లు ఎదురవుతు న్నప్పటికీ కోవిడ్‌ను ఎదుర్కోవడంలో భారత్‌ అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శిస్తోంద ని ఆమె కొనియాడారు. 

మరిన్ని వార్తలు