అమెరికా సిద్ధంగా ఉంది: ట్రంప్‌

1 Mar, 2017 07:59 IST|Sakshi
అమెరికా సిద్ధంగా ఉంది: ట్రంప్‌

అమెరికన్‌ కాంగ్రెస్‌లో బుధవారం ట్రంప్‌ తన మొదటి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కూచిభొట్ల శ్రీనివాస్‌ హత్యను ట్రంప్‌ ఖండించారు. శ్రీనివాస్‌ మృతి పట్ల అమెరికన్‌ కాంగ్రెస్‌ నిమిషం పాటు మౌనం పాటించి సంతాపం తెలిపింది. విద్వేష దాడులకు అమెరికాలో చోటు లేదని.. విద్వేషాలను అందరూ ఖండించాలని ట్రంప్‌ పిలుపునిచ్చారు.

ఒబామా పాలనా కాలంలోనే ఉగ్రవాద దాడులు పెరిగాయని తొలి కాంగ్రెస్‌ ప్రసంగంలో ట్రంప్ విమర్శించారు. అమెరికా పౌరులకు రక్షణ, ఉద్యోగాల కల్పనే తన తొలి ప్రాధాన్యత అని ట్రంప్‌ పునరుద్ఘాటించారు. యూదులపై జరుగుతున్న దాడులను ట్రంప్ ఖండించారు. అధ్యక్ష ఎన్నికల తరువాత పరిస్థితి సానుకూలంగా మారుతుందని వెల్లడించారు. మాదకద్రవ్య వ్యాపారులు, రౌడీలను నిర్మూలించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తమ పాలనలో అవినీతికి తావు లేదని, లాబీయింగ్పై ఐదేళ్లు నిషేధం అని ట్రంప్ తెలిపారు. అమెరికా శక్తివంతమైన, స్వేచ్ఛాదేశం అని ట్రంప్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

అమెరికా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నెలరోజుల్లో తన పనితీరుపై ట్రంప్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్‌లు పుంజుకుంటున్నాయని తెలిపారు. దేశ దక్షిణ దిశలో గోడను నిర్మించి సరిహద్దులను బలోపేతం చేస్తామని, ఇస్లామిక్‌ తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని తెలిపిన ట్రంప్.. ప్రపంచాన్ని ముందుండి నడిపేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు.