కరోనా: ‘చైనా నమ్మదగ్గ భాగస్వామి కాదు’

2 Apr, 2020 11:56 IST|Sakshi

చైనా కరోనా గణాంకాలపై ట్రంప్‌ సందేహం

చైనాపై విరుచుకుపడిన రిపబ్లికన్లు 

వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ సృష్టించిన కల్లోలం అమెరికా- చైనాల మధ్య వాగ్యుద్దాన్ని రాజేసింది. మహమ్మారి పుట్టుకకు చైనానే కారణమని అమెరికా ఆరోపిస్తుండగా.. అగ్రరాజ్య సైనికులే తమ దేశంలో వైరస్‌ను వ్యాప్తి చేశారంటూ ఇరు దేశాలు పరస్సర ఆరోపణలకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనాను పదే పదే చైనీస్‌ వైరస్‌ అని ప్రస్తావించడంతో మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇక ఇప్పుడు చైనాలోని కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలకు సంబంధంచిన గణాంకాలపై ట్రంప్‌ మరోసారి సందేహాలు వ్యక్తం చేశారు. చైనాతో సత్సంబంధాలు ఉన్నాయంటూనే.. కరోనా విషయంలో చైనా చెబుతున్న లెక్కలకు విశ్వసనీయత లేదని విమర్శించారు. కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు లేవనెత్తిన అనుమానాలకు మద్దతుగా తన వాణి వినిపించారు.(కరోనా: డబ్ల్యూహెచ్‌ఓ తీరుపై ట్రంప్‌ విమర్శలు)

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో.. బుధవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌... ‘‘ వాళ్లు కచ్చితమైన వివరాలు చెబుతున్నారని మనకు ఎలా తెలుస్తుంది. ఆ గణాంకాలు చాలా తక్కువగా అనిపిస్తున్నాయి’’అని వ్యాఖ్యానించారు. ​కాగా చైనాలోని వుహాన్‌ నగరంలో తొలిసారిగా ప్రాణాంతక కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం నాటికి అక్కడ 82,361 కరోనా కేసులు, 3316 మరణాలు సంభవించినట్లు చైనా నిర్ధారించిందని జాన్‌ హ్యాప్కిన్స్‌ యూనివర్సిటీ పేర్కొంది. ఇక అదే సమయానికి అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 2,06, 207, మృతుల సంఖ్య 4542గా నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. (చైనా గోప్యత వల్లే భారీ మూల్యం..)

చైనాను నమ్మలేం: రిపబ్లికన్లు
ఈ నేపథ్యంలో అధికారంలో రిపబ్లికన్లు పలువురు చైనా ఉద్దేశపూర్వకంగానే కరోనా లెక్కలపై అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. చైనా చెప్పేవన్నీ తప్పుడు లెక్కలు అని.. తమ పాలనపై విమర్శలు రాకుండా ఉండేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ అబద్ధాలు ఆడుతోందని మండిపడ్డారు. ఇక అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడైన మైఖేల్‌ మెకాల్‌ మాట్లాడుతూ కరోనాపై పోరాటంలో చైనా నమ్మదగ్గ భాగస్వామి కాదు అని వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తి గురించి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు అక్కడి డాక్టర్లు, జర్నలిస్టుల నోళ్లు నొక్కేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు