‘జూలో ఉండే జంతువు ఎవరో కాదు.. ఈ జూనియరే’

10 Jan, 2019 12:35 IST|Sakshi
కుమారుడితో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

శరణార్థులపై ట్రంప్‌ కుమారుడి విద్వేషం

వాషింగ్టన్‌ : శరణార్థులుగా అమెరికాకు వచ్చే వారిని జంతువులతో పోలుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ జాత్యహంకారం ప్రదర్శించారు. జీరో టాలరెన్స్‌ పేరిట శరణార్థులు, వారి పిల్లలను వేరు చేస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు వలసవాదులను అడ్డుకునేందుకు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్‌ అడిగిన (500 కోట్ల డాలర్ల) డబ్బుపై ఏ నిర్ణయమూ తీసుకోకుండానే కాంగ్రెస్‌ వాయిదా పడింది కూడా. ఈ క్రమంలో మెక్సికో గోడ నిర్మాణం ఆవశ్యకతను వివరిస్తూ.. ‘ జూలో ఓరోజు మొత్తం ఎందుకు ఎంజాయ్‌ చేస్తారో తెలుసా. అక్కడ గోడలు ఉంటాయి కాబట్టి’ అని ట్రంప్‌ జూనియర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చారు.(‘నా పిల్లలు బతికి ఉంటే చాలు.. ఇంకేం వద్దు’)

కాగా జంతువుల బారి నుంచి ప్రజలను కాపాడాలంటే గోడ కట్టక తప్పదు కదా అనే అర్థం వచ్చేలా ఉన్న జూనియర్‌ రాతలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘జాతి అహంకారానికి ఇది నిదర్శనం’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ‘జూలో ఉండే జంతువు మరెవరో కాదు ఈ జూనియరే’ అంటూ మరొకరు ఘాటుగా స్పందించారు. గతంలో కూడా ఇదే రీతిలో సిరియా శరణార్థులపై జూనియర్‌ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇటీవలే ఆయన తండ్రి ట్రంప్‌ కూడా వలసవాదుల గురించి ప్రస్తావిస్తూ.. ‘వీళ్లంతా చాలా చెత్త మనుషులు. అయినా వీళ్లని మనుషులు అనకూడదు. జంతువులు అనాలి’  అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు