ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్‌..!

22 Aug, 2018 12:06 IST|Sakshi
మైఖేల్‌ కోహెన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ (ఫైల్‌ ఫొటో)

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ట్రంప్‌ వద్ద పర్సనల్‌ లాయర్‌గా పనిచేసిన మైఖేల్‌ కోహెన్‌ను మన్‌హట్టన్‌లోని ఫెడరల్‌ కోర్టు దోషిగా తేల్చింది. 2016 ఎన్నికల సమయంలో కోహెన్‌ ఇద్దరు మహిళలకు డబ్బు ఆశ జూపి వారిని ఎన్నికల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా పనిచేయకుండా చేశారని తెలిపింది. తనతో వ్యక్తిగత సంబంధాలున్న ఇద్దరు మహిళల వ్యతిరేక ప్రచారాన్ని ట్రంప్‌ ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడానికి కోహెన్‌ పనిచేశాడని కోర్టు వెల్లడించింది. 8 చార్జిషీట్లలో దోషిగా తేలిన కోహెన్‌పై పన్ను ఎగవేత అభియోగాలు కూడా రుజువయ్యాయి.

అయితే, కోర్టు విచారణలో ట్రంప్‌కు సంబంధించి కోహెన్‌ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ, కోహెన్‌ తరపు లాయర్‌ లానీ దావిస్‌ మాత్రం కోహెన్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారం కోసం పనిచేశాడని చెప్తున్నారు. కోహెన్‌ దోషిగా తేలినందున ఈ వ్యవహారంలో ట్రంప్‌కు కూడా చిక్కులు తప్పవని హెచ్చరించారు. కోహెన్‌ ఒకరికి లక్షా ముప్పై వేలు, మరొకరికి లక్షా యాభై వేల డాలర్లు చెల్లించినట్లు తేలిందని దావిస్‌ తెలిపారు. మరోవైపు ఇద్దరు మహిళలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలను ట్రంప్‌ తోసిపుచ్చారు.

ట్రంప్‌, ఆయన కుంటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్‌ తరపు న్యాయవాది రూడీ గిలియానీ అన్నారు. ట్రంప్‌ వ్యక్తిగత జీవితాన్ని బజారున పెట్టి ఆయన కుటుంబంలో చిచ్చుపెట్టడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. కోహెన్‌ ట్రంప్‌పై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో కోహెన్‌ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని గ్రహించి అతన్ని ట్రంప్‌ ఎప్పుడో దూరం పెట్టాడని అన్నారు.

మరిన్ని వార్తలు