‘దేశభక్తి చట్టం’ ఉపయోగించిన ట్రంప్‌

30 Nov, 2019 17:29 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా మొట్టమొదటి సారిగా ‘దేశభక్తి చట్టం’ను ఉపయోగించింది. ఈ చట్టాన్ని ఉపయోగించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రికార్డుల్లోకి ఎక్కారు. టెర్రరిస్టు కార్యకలాపాలకు సంబంధించి ఆదమ్‌ అమీన్‌ హసౌన్, అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 50 ఏళ్ల పైబడిన ఆదమ్‌కు 2017లోనే శిక్షాకాలం పూర్తయింది. ప్రతికూల పరిస్థితుల్లో ఆయన్ని విడుదల చేయకుండా, ఎలాంటి విచారణ లేకుండానే జీవితాంతం జైల్లో నిర్బంధించేందుకు ‘దేశభక్తి చట్టం’ను ప్రయోగించారు. ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

జన్మతా లెబనాన్‌కు చెందిన ఆదమ్‌ను మొదటి సారి 2002, జూన్‌ నెలలో అక్రమ వలస కేసులో అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత టెర్రరిజానికి వ్యతిరేకంగా అమెరికా యుద్ధం ప్రకటించాక ఎక్కువ సార్లు ఆదమ్‌ కటకటాల వెనక్కే ఉన్నారు. వాస్తవంగా ఆయన ప్రత్యక్షంగా టెర్రరిస్టు కార్యకలాపాల్లో పాల్గొనలేదు. కానీ టెర్రరిస్టు కార్యకలాపాలకు మద్దతిస్తున్న పలు ముస్లిం చారిటీ సంస్థలకు భారీగా విరాళాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఈ చారిటీ సంస్థలను కూడా అమెరికా నిషేధించింది.

2017లో ఆదమ్‌ శిక్షాకాలం పూర్తయ్యాక ఆయన పుట్టిన లెబనాన్‌గానీ, పెరిగిన పాలస్తీనాను ఆక్రమించుకున్న ఇజ్రాయిల్‌గానీ శరణార్థిగా తీసుకునేందుకు తిరస్కరించడంతో జాతీయ భద్రతా దృష్ట్యా ఆయన్ని దేశభక్తి చట్టంలోని 412 సెక్షన్‌ కింద నిర్బంధించారు. కేవలం విదేశీయులకే వర్తించే ఈ చట్టాన్ని అమెరికాపై ఒసామా బిన్‌ లాడెన్‌ జరిపించిన వైమానిక దాడుల అనంతరం 2001, అక్టోబర్‌ 26వ తేదీన అమెరికా పార్లమెంట్‌ ఆమోదించింది.

మరిన్ని వార్తలు