‘ట్రంప’రితనం... మానసిక వ్యాధా?

9 Jan, 2018 02:37 IST|Sakshi

అవునంటున్న సైకియాట్రిస్టులు

ఆయన ట్వీట్లపై ఓ పుస్తకం రాసి విశ్లేషించిన రాచెల్‌

‘ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ చెబుతున్నాడు...తన డెస్క్‌పై న్యూక్లియర్‌ బటన్‌ ఎప్పుడూ ఉంటుందని. ఆకలితో అల్లాడుతున్న ఆ దేశపు వాళ్లెవరైనా ఆయనకు చెప్పండి...నా దగ్గరా అంతకన్నా పెద్దది, శక్తిమంతమైన బటన్‌ ఉందని’... అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ట్వీట్‌ ఇది. చూసిన వెంటనే ‘నా చాక్లెట్‌ నీ కంటే పెద్దది’ అంటూ గొప్పలు పోయే చిన్న పిల్లల పోరుగుర్తుకు తెప్పిస్తుంది కదూ! అగ్రదేశాధినేత ఈ రకమైన ట్వీట్లు పెట్టడం ఆయన మానసిక స్థితిపై సందేహాలు రేకెత్తిస్తోంది. పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇలాంటి వైఖరే. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్‌ విశ్వవిద్యాలయం సైకియాట్రీ అధ్యాపకురాలు బ్రాండీ ఎక్స్‌ లీ... ట్రంప్‌ పరిస్థితి ఏమాత్రం బాగా లేదనీ, ఆయన అధ్యక్షుడిగా కొనసాగడం మంచిది కాదంటూ అమెరికా ఎంపీలకు ఓ ప్రెజంటేషన్‌ ఇచ్చారు. ట్రంప్‌ ట్వీట్లు చెప్పే ఆయన మానసిక పరిస్థితిపై ప్రత్యేక కథనమిది.

నన్ను మించిన వాడు లేడు...
నేనే అందరికంటే గొప్పవాణ్ని...ఎలాంటి సమస్యనైనా నేను ఒక్కడినే సరిచేయగలను... డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్లు చూస్తే ఈ లక్షణాలు మెండుగా కనిపిస్తాయి అంటారు రాచెల్‌ మోంటగోమరి. అధ్యక్షుడిగా ట్రంప్‌ చేసిన దాదాపు 34 వేల ట్వీట్ల ఆధారంగా ఆయన మానసిక స్థితిని విశ్లేషిస్తూ రాచెల్‌ ఓ పుస్తకం రాశారు. ఈ భూమ్మీద తనకు తెలియని విషయమే లేదని ట్రంప్‌ నమ్ముతారు. నడత, చదువు, వ్యవహారశైలి వంటి విషయాలపై ఈయ న పెట్టే శ్రద్ధ తదితర లక్షణాలను పరిశీలిస్తే వాస్తవం ఆయన నమ్మకానికి భిన్నమ ని ఇట్టే అర్థమైపోతుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఓ వీడియోలో... ట్రంప్‌ మూడంటే మూడే నిమిషాల వ్యవధిలో తనకు 20 సబ్జెక్టుల్లో గొప్ప జ్ఞానముందని డబ్బా కొట్టుకోవడాన్ని రాచెల్‌ ప్రస్తావించారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సందర్భం లోనూ విదేశీ వ్యవహారాలపై మీరు ఎవరి సలహాలు తీసుకుంటారు? అన్న ప్రశ్న వేస్తే ట్రంప్‌ ఇచ్చిన సమాధానం.. ‘‘నాతో నేనే మాట్లాడుకుంటా. ఎందుకంటే నా బుర్ర బాగా పనిచేస్తోంది కాబట్టి’’ అని!

సంఘ వ్యతిరేక లక్షణాలు..  
పొలిటీఫ్యాక్ట్‌ అని ఓ వెబ్‌సైట్‌ ఉంది. అమెరికా నేతలు చేసే కామెంట్లు.. అందులోని వాస్తవికతలను ప్రజల ముందు పెట్టే వెబ్‌సైట్‌ ఇది. దీని అంచనా ప్రకారం.. అధ్యక్షుడు ట్రంప్‌ స్టేట్‌మెంట్లలో 76 శాతం అబద్ధాలే. ఇంకా ఈ వెబ్‌సైట్‌ ఏం చెప్పిందంటే.. ప్రతి మూడు నిమిషాల 15 సెకన్లకు ట్రంప్‌ ఓ అబద్ధం చెబుతున్నాడట. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే.. అబద్ధాలు చెప్పడం... ఇతరులను వాడుకోవడం, ఇతరుల హక్కులను ఏమాత్రం ఖాతరు చేయకపోవడం.. తన వల్ల ఇతరులకు హాని కలిగినా కాసింత కూడా పశ్చాత్తాపం, సానుభూతి చూపకపోవడం వంటి లక్షణాలన్నీ సంఘ వ్యతిరేక వ్యక్తిత్వ లక్షణాలుగా మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు కాబట్టి! న్యూయార్క్‌టైమ్స్‌ కథనం ప్రకారం ఫ్రాంక్‌ లంట్జ్‌ అనే వ్యక్తి ట్రంప్‌ను ‘మీరెపుడైనా తన తప్పులకు మన్నించమని దేవుడిని అడిగారా?’ అని అడిగితే లేదని సమాధానమివ్వడాన్ని బట్టి ట్రంప్‌ వ్యక్తిత్వం ఏమిటో తెలిసిపోతోంది!

నిత్య శంకితుడు..
ప్రతిదాన్నీ అనుమానపు దృష్టితో చూడటం...ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతోందని నమ్మే రకాల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఒకరు. ఎన్నికలప్పుడు ట్రంప్‌ చేసిన ప్రకటనలు చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. అమెరికా ఎన్నికల్లో రష్యా పరోక్షంగా వేలు పెట్టిందని నిఘా వర్గాలు కోడై కూస్తే.. దాన్ని కొట్టిపారేయడం వీటిల్లో ఒకటి మాత్రమే. మొత్తమ్మీద ఎన్నికల సమయంలో ఈయనగారు ఇలాంటి కుట్ర కథనాలు దాదాపు 48 వరకూ ప్రకటించారని అంచనా. అధ్యక్షుడయ్యాక ఇవి ఏమైనా తగ్గాయా? అంటే.. ఇంకా పెరిగాయనే చెప్పాలి. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా.. తన ట్రంప్‌ టవర్‌లోని ఫోన్లు ట్యాప్‌ చేశాడన్న ఆరోపణ కూడా చేశారు. నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రతిదాన్ని అనుమానపు దృష్టితో చూస్తారనేందుకు ఇంతకంటే వేరే నిదర్శనాలు అవసరం లేదేమో!

శాడిజం పాళ్లూ ఎక్కువే...
ట్రంప్‌ ట్వీట్ల ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని విశ్లేషించిన రాచెల్‌ అంచనా ప్రకారం..ట్రంప్‌లో శాడిజం పాళ్లూ ఎక్కువే. తనతో ఏకీభవించని వారిని ట్వీట్లలో హేళన చేస్తూ మాట్లాడటం ట్రంప్‌కు అధ్యక్షుడు కాకముందు నుంచీ అలవాటే. తన కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేసిన పౌరుడిని ఉద్దేశించి..‘వాడి మొహం మీద గుద్దు గుద్దాలని ఉంది’ గతంలో ట్రంప్‌ అన్నారనీ, తన వైఖరిపై నిరసన తెలిపేవారిని సూట్‌ లాగేసి చల్లటి వాతావరణంలోకి వదిలేయాలనడం, ‘మా చిన్నప్పుడు ఇలా చేసేవాళ్లం’ అని పళ్లు ఇకిలించడం ట్రంప్‌కే చెల్లిందని రాచెల్‌ అన్నారు. ట్రంప్‌ ఎదుటివారి బాధలో తన ఆనందాన్ని వెతుక్కుంటాడని ఆమె చెప్పారు. సీఎన్‌ఎన్‌ న్యూస్‌తోపాటు చాలామందిని బాక్సింగ్‌ గ్లోవ్స్‌తో పంచ్‌ చేస్తున్న ఫొటోలు పెట్టే తత్వం ఇంతకంటే భిన్నంగా ఉంటుందని అనుకోలేం కదా?
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా