అమెరికాను ముస్లింలు ద్వేషిస్తారా?

14 Mar, 2016 18:29 IST|Sakshi
అమెరికాను ముస్లింలు ద్వేషిస్తారా?

లండన్: ‘ఇస్లాం మమ్మల్ని ద్వేషిస్తోంది’ అంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున ఫ్రంట్ రన్నర్‌గా ఉన్న డొనాల్ట్ ట్రంప్ ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అమెరికాను ద్వేషిస్తారంటూ మరో సందర్భంలో నొక్కి చెప్పారు. ఆయన చేసిన ఈ ఆరోపణల్లో నిజం ఉందా? నిజంగా ముస్లింలు అమెరికాను ద్వేషిస్తారా?

ముస్లింలు మైనారిటీగా ఉన్న దేశాల్లో మాత్రమే ముస్లింలు అమెరికాను ద్వేషిస్తున్నారని, ముస్లింలు మెజారిటీగా ఉన్న దేశాల్లో ముస్లింల వైఖరి పరస్పర భిన్నంగా ఉందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇరాక్‌పై అమెరికా యుద్ధం చేసిన సమయంలోనే మెజారిటీ ముస్లింలు అమెరికాను ద్వేషించారని, ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే ముస్లింలు అమెరికాను ద్వేషిస్తున్నారని ప్రపంచ ప్రజల వైఖరిపై సర్వే జరిపిన పియూస్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది.

ఈజిప్టు, జోర్డాన్ లాంటి మధ్యప్రాచ్య దేశాల్లో మాత్రమే అమెరికా అంటే ద్వేషం ఉందని, మధ్యప్రాచ్యం మినహా మిగతా ముస్లిం దేశాల్లో అమెరికా అంటే సానుకూల వైఖరి ఉంది. అమెరికాను వ్యతిరేకిస్తున్న ముస్లిం దేశాల్లో కూడా అమెరికాను ఇస్లాం మతపరంగా ద్వేషించడం లేదు. అమెరికా విదేశాంగ వైఖరినిబట్టే అమెరికాను ద్వేషిస్తున్నారు. ప్రపంచంలోనే ముస్లింలు ఎక్కువగావున్న ఇండోనేషియాలో 62 శాతం ప్రజలు అమెరికాను సానుకూలంగా ఉన్నారు. 90 శాతం ముస్లింలు ఉన్న సెనెగల్ దేశంలో 80 శాతం మంది ముస్లింలు అమెరికాను సానుకూలంగా ఉన్నారు.

అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు స్వీకరించాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 160 కోట్ల ముంది ముస్లింలలో అమెరికా పట్ల సానుకూల వైఖరి పెరగుతూ వచ్చిందని పియూస్ రీసెర్చ్ సెంటర్ సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఒబామాకు ముందు పాలస్తీనా ప్రాదేశిక ప్రాంతాల్లో 70 శాతం ముస్లిం ప్రజలు అమెరికాను ద్వేషించేవారు. వారిలో 80 శాతం మంది ఒబామా వచ్చాక సానుకూలంగా మారిపోయారు.

పాకిస్తాన్‌లో మాత్రం అమెరికా అంటే 61 శాతం ప్రజలకు ప్రతికూల అభిప్రాయం ఉంది. 98 శాతం ముస్లింలు ఉన్న టర్కీ దేశంలో 36 శాతం మంది ప్రతికూలంగా, 36శాతం మంది అనుకూలంగా 28శాతం మంది తటస్థంగాఉన్నారు.

మరిన్ని వార్తలు