ట్రంప్ గెలిచాడు...

10 Nov, 2016 01:53 IST|Sakshi
ట్రంప్ గెలిచాడు...

 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ విజయ కేతనం
 ట్రంప్‌కు 305, హిల్లరీకి 232 ఎలక్టోరల్ ఓట్లు
 పాపులర్ ఓటులో మాత్రం హిల్లరీకే ఆధిక్యం... హిల్లరీకి 47.7 శాతం ట్రంప్‌కు 47.5 శాతం
 హిల్లరీ ఓటమిని శాసించిన పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సన్
 స్వింగ్ స్టేట్స్ ఒహయో, ఫ్లోరిడా, నార్త్ కరోలినాలో ట్రంప్ గెలుపు

 
 హిల్లరీ ఓటమిని శాసించిన పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సన్
 స్వింగ్ స్టేట్స్ ఒహయో, ఫ్లోరిడా, నార్త్ కరోలినాలో ట్రంప్ గెలుపు
 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ ఆధిక్యం
 పాపులర్ ఓట్లలో మాత్రం హిల్లరీదే పై చేయి

 
 సర్వేలన్నీ బోల్తా కొట్టాయి..
 అంచనాలన్నీ తలకిందులయ్యాయి..
 ‘హిల్లరీ.. హిల్లరీ..’ అన్నవారు నోళ్లెళ్లబెట్టారు..
 ‘స్వదేశీ’ నినాదం నింగినంటింది..
 ‘స్ట్రాంగ్ టుగెదర్.. ’ అంటూ వచ్చిన హిల్లరీకి షాక్..
 ‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్..’ అంటూ దూసుకొచ్చిన ట్రంప్ రాక్స్..
 స్త్రీలోలుడని, కయ్యాలమారి అని, వలసల వ్యతిరేకి అని, ట్యాక్స్ ఎగవేతదారు అని..
 ఒకటా.. రెండా.. ఎన్నెన్నో..!
 వాటన్నింటినీ ‘సెంటిమెంట్’తో తుత్తునియలు చేస్తూ..
 ఈస్ట్, వెస్ట్‌ను ఓ ఊపు ఊపేస్తూ..
 ‘బ్లాక్’ అండ్ ‘వైట్’ గోడల్ని బద్దలు కొట్టేస్తూ..
 అమెరికాలో వినూత్న ఒరవడికి తెరదీస్తూ..
 దూసుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్..!!
 45వ అధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టబోతున్నాడు ఈ 70 ఏళ్ల బిజినెస్‌మ్యాన్!!!
 అందరి లెక్కల్ని తారుమారు చేస్తూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన విజయం సాధించారు. గెలుపు అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా కోసం కలసికట్టుగా ముందుకు సాగాలని కోరారు.

 
 అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ... హిల్లరీదే అధ్యక్ష పీఠమని చివరి వరకూ వేసిన లెక్కల్ని తారుమారు చేస్తూ... రిపబ్లికన్ అభ్యర్థి  ట్రంప్ సంచలన విజయం సాధించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఎంత ప్రచారం జరిగినా... ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేసినా అమెరికన్లు మాత్రం ఆయనకే పట్టంగట్టారు. ఉద్యోగ భద్రత, ఉగ్రవాద ముప్పు నుంచి దేశానికి విముక్తి, వలసలకు అడ్డుకట్ట హామీలకే జనం ఓటేశారు. తనకు పట్టున్న రాష్ట్రాలతో పాటు డెమోక్రాట్ల కంచుకోటలన్నింటిని ట్రంప్ బద్దలుకొట్టారు. ఫలితాన్ని తారుమారు చేసే ఫ్లోరిడా, ఒహయో, నార్త్ కరోలినా రాష్ట్రాలను కూడా తన ఖాతాలో వేసుకున్నారు.
 
 - వాషింగ్టన్/న్యూయార్క్
 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు మొత్తం 538. ఇందులో ట్రంప్ 305 ఓట్లు సాధించగా, డెమోక్రాట్ల అభ్యర్థి  క్లింటన్‌ను 232తో సరిపెట్టుకున్నారు. 18 నెలల క్రితమే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించిన 70 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త  ట్రంప్... ఈ గెలుపుతో జనవరి 20న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించనున్నారు. అయితే పాపులర్ ఓట్లు(అత్యధిక ఓట్లు) హిల్లరీనే సాధించడం విశేషం. హిల్లరీ 47.7 శాతం(5,93,21,645), ట్రంప్47.5 శాతం(5,91,50,974) సాధించారు. మిషిగన్, న్యూహ్యాంప్‌షైర్, మిన్నెసోటా రాష్ట్రాలతో పాటు నెబ్రాస్కాలో ఒక ఫలితం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
 
 గెలుపు అనంతరం ట్రంప్ ప్రసంగిస్తూ... ‘మన మధ్య విభేదాలతో ఏర్పడ్డ గాయాల్ని మర్చిపోదాం. అమెరికన్లందరికీ నేను అధ్యక్షుడిగా ఉంటా. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు, ఇండిపెండెంట్స్ అందరూ ఐక్యంగా సాగేందుకు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు. ప్రత్యర్థి హిల్లరీని పొగుడుతూ... ‘ఆమె గొప్ప పోరాటం చేశారు. హిల్లరీ సేవలకు దేశం రుణపడి ఉంటుంది’ అని అన్నారు. అమెరికా తొలి మహిళా ప్రెసిడెంట్ కావాలన్న ఆశలు గల్లంతవడంతో హిల్లరీ ఓటమిని వినయంగా అంగీకరించి  శ్వేతసౌధ విజేత ట్రంప్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
 
 మూడు రాష్ట్రాలే ముంచాయి
 పెన్సిల్వేనియా, విస్కాన్సన్, మిషిగన్, ఒహయో, ఫ్లోరిడా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ గెలుపుతో సీన్ మొత్తం మారిపోయింది. ఫ్లోరిడా, ఒహయో, నార్త్ కరోలినాల్లో హోరాహోరీ ఉంటుందని మొదటి నుంచి భావించారు. అక్కడ ట్రంప్ హవాతో హిల్లరీ ఓటమి ముందే తెలిసిపోయింది. డెమోక్రాట్లకు పెట్టని కోటలైన పెన్సిల్వేనియా, విస్కాన్సన్, మిషిగన్‌లు ట్రంప్ ఖాతాలోకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. విస్కాన్సన్, పెన్సిల్వేనియా, మిషిగన్‌లు మొదటి నుంచి డెమోక్రాట్లకు పూర్తి పట్టున్న రాష్ట్రాలు ... ఈ రాష్ట్రాల్లో మొత్తం 46 ఎలక్టోరల్ సీట్లు ఉన్నాయి. ఇవి తప్పకుండా హిల్లరీకే వస్తాయని భావించారు. ఇవి హిల్లరీ ఖాతాలోకి వెళ్తే ఆమెకు దాదాపు 274 సీట్లు దక్కేవి. స్వింగ్ స్టేట్స్‌లో విజయం సాధించకపోయినా హిల్లరీ విజయం ఖాయమయ్యేది. స్వింగ్ స్టేట్స్ ఓహయో, నార్త్ కరోలినా, ఫ్లోరిడాల్లో కనీసం ఏదో ఒక రాష్ట్రంలో హిల్లరీ గెలుస్తుందని భావించారు. విస్కాన్సన్, పెన్సిల్వేనియా, మిషిగన్‌ల్లో ఓడినా... ఫ్లోరిడా, ఒహయోలో గెలిస్తే 47 సీట్లు దక్కేవి. ఈ అంచనాలేవీ పని చేయలేదు.
 
 ఆ మూడు రాష్ట్రాల్లో ఏం జరిగింది?
 విస్కాన్సన్, మిషిగన్, పెన్సిల్వేనియాలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత, చిన్నాచితకా పనులు చేసే ఓటర్లే.. వారికి ఉద్యోగ భద్రత కల్పించి, వలసదారులను నిరోధిస్తానని ట్రంప్ ఇచ్చిన నినాదం పనిచేసింది. అలాగే చివరి వారం రోజులు ఈ రాష్ట్రాల్లో ట్రంప్ అత్యధిక సభల్లో పాల్గొన్నారు. మరోవైపు విస్కాన్సన్, మిషిగన్ ప్రైమరీల్లో డెమోక్రటిక్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డ బెర్నీ శాండర్స్ చేతిలో హిల్లరీ ఓడిపోయారు. ఆ ప్రభావం కూడా పడిఉండొచ్చని విశ్లేషకుల అంచనా... ఫ్లోరిడా, నెవడా రాష్ట్రాల్లో స్పానిష్ మాట్లాడే ఓటర్లు ముందుగానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరంతా ఎక్కువగా హిల్లరీకి ఓటేసినా... తెల్లజాతి ఓటర్లు ఎన్నికల రోజు క్యూ కట్టడంతో ట్రంప్ విజయం సులువైంది.
 
 హిల్లరీ శిబిరంలో ఆనందం ఆవిరి
 ఎన్నికలు ప్రక్రియ ముగిసేవరకూ గెలుపు తమదేననుకున్న హిల్లరీ శిబిరం ఆనందంలో మునిగితేలింది. మన్‌హటన్‌లోని కన్వెన్షన్ సెంటర్‌లో సంబరాలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఫలితాలు వెలువడడం మొదలైంది.  
 
 కౌంటింగ్ సరళి ఇలా..
భారత కాలమానం ప్రకారం.. బుధవారం పొద్దున 5.30 గంటలకు 6 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి.. ఇండియానా(11), కెంటకీ(8)ల్లో ట్రంప్ గెలుపు. హిల్లరీ వెర్మాంట్(3)లో గెలుపు.
 
ఉదయం 6.05 గం. వెస్ట్‌వర్జీనియాలో ట్రంప్ గెలుపు
♦  6.25 గం. నార్త్ కరోలినా, ఒహయోల్లో పోలింగ్ పూర్తి... అందరిలో ఉత్కంఠ.
 
6.35 గం. సగం రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తి.. ఒహయో, ఫ్లోరిడా, నార్త్ కరోలినా, న్యూ హ్యాంప్‌షైర్, వర్జీనియాల కౌంటింగ్ ప్రారంభం . మరోవైపు దక్షిణ, మధ్యపశ్చిమ రాష్ట్రాల్ల్లో అనుకున్నట్లే ట్రంప్ విజయం... తూర్పు తీర రాష్ట్రాల్లో హిల్లరీ గెలుపు
 
7.40 గం. టెక్సాస్, నార్త్ డకోటా, సౌత్ డకోటా, వయోమింగ్, కాసస్‌లో ట్రంప్.. ఇలినాయ్, న్యూయార్క్‌లో హిల్లరీ గెలుపు. ఆ సమయంలో ట్రంప్ ఆధిక్యం 123... క్లింటన్ ఆధిక్యం 97...
 
7.50 గం. రిపబ్లికన్ పార్టీ ఖాతాలో ఆర్కాన్సాస్.. 8.02 గం. లూసియానాలో ట్రంప్, కనెక్టికట్‌లో హిల్లరీ గెలుపు
 
8.08 గం. ట్రంప్‌కు ఆధిక్యంతో కుప్పకూలిన ఆసియా మార్కెట్లు
 
 అక్కడి నుంచి ట్రంప్ దూసుకుపోయారు. ఉదయం 9.15 గం. ఒహయోలో గెలుపు. ట్రంప్ ఆధిక్యం 168, హిల్లరీ 109
 
9.33 గం. కీలక రాష్ట్రం ఫ్లోరిడాలో ట్రంప్ మోత... తదుపరి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌కు మార్గం సుగమం
 
10.27 గం. జార్జియా, ఉటావా విజయాలతో 244కు ట్రంప్ ఆధిక్యం
 
12.59కి విస్కాన్సన్ విజయం ట్రంప్ గెలుపు పరిపూర్ణం... 270 ఎలక్టోరల్ సీట్లు దాటిన ట్రంప్ ఆధిక్యం.

 
 ట్రంప్ గెలుపొందిన రాష్ట్రాలు
 పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, అలాస్కా, ఉటావా, అయోవా, అరిజోనా, విస్కాన్సన్, జార్జియా, ఒహయో, నార్త్ కరోలినా, నార్త్ డకోటా, సౌత్ డకోటా, నెబ్రాస్కా, కాసస్, ఒక్లహోమా, టెక్సాస్, వయోమింగ్, ఇండియానా, కెంటకీ, టెన్నెసే, మిస్సిసిపీ, అర్కాన్సాస్, లూసియానా, వెస్ట్ వర్జీనియా, అలాబామా, సౌత్ కరోలినా, మోంటానా, ఐడహ, మిస్సోరీ, న్యూహ్యాంప్‌షైర్,  మిషిగన్ రాష్ట్రాలు.
 
 క్లింటన్ గెలుపొందిన రాష్ట్రాలు
 కాలిఫోర్నియా, నెవెడా, హవాయ్, ఇలినాయిస్, న్యూ యార్క్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా, వెర్మాంట్, మస్సాచుసెట్స్, కనెక్టికట్, డెలావేర్, కొలొరాడో, న్యూ మెక్సికో, వర్జీనియా, ఒరేగాన్, వాషింగ్టన్, రోడ్ ఐలాండ్, మిన్నెసోటా, మైనేలో మూడు స్థానాలు డెమోక్రాట్ల ఖాతాలో... ఒకటి రిపబ్లికన్‌‌స ఖాతాలో.
 
ఒబామా పిలుపు
 ట్రంప్‌కు... ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్ చేసి అభినందించారు. అధికార మార్పిడికి సంబంధించి చర్చించేందుకు వైట్ హౌస్‌కు రావాలం టూ ఆహ్వానించారు.
 
ట్రంప్‌తో కలసి పనిచేసేందుకు సిద్ధం
 న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నానని హిల్లరీ చెప్పారు. న్యూయార్క్‌లో బుధవారం రాత్రి మద్దతుదారుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ... అమెరికన్లందరికీ  ట్రంప్ విజయవంతమైన అధ్యక్షుడిగా పాలన అందిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మనం పడ్డ కష్టానికి, ఆశించినదానికి రావాల్సిన ఫలితం ఇది కాదు. ఎన్నికల్లో గెలవలేకపోరుునందుకు క్షమాపణలు చెబుతున్నా’అని ఉద్వేగంతో అన్నారు.  ఒక దశలో ఉబికివస్తోన్న కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించారు.‘ట్రంప్‌కు ఫోన్లో శుభాకాంక్షలు చెప్పాను. దేశం కోసం కలసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. ఎన్నికల ఫలితాల్ని దేశం అంగీకరించాలన్నారు. ‘మీరు ఎంత బాధపడుతున్నారో... ఆ బాధ అనుభవిస్తోన్న నాకు తెలుసు’ అని అన్నారు.  
 
 సర్వే ఫలితాలు తారుమారు  
 వాషింగ్టన్: ఎన్నికలపై వచ్చిన సర్వే ఫలితాల్లో 90 శాతం తప్పుగా వచ్చాయి. 322 సీట్లను హిల్లరీ అవలీలగా గెలుస్తారని, ట్రంప్ గల్లంతవడం ఖాయమన్న అంచనాలు పటాపంచలయ్యాయి. ఇంటా బయటా విమర్శలను ఎదుర్కొని ఓటమి తప్పదన్న అంచనాలను తోసిరాజని రిపబ్లికన్ పార్టీ నామినీ ట్రంప్ అగ్రరాజ్యం పీఠాన్ని కై వసం చేసుకోవడం భారీ సంచలనాన్నిసృష్టించింది. సీబీఎస్, ఏబీసీ/వాషింగ్టన్ పోస్టు, సీఎన్‌ఎన్, బీబీసీ, బ్లూమ్‌బెర్గ్, రాస్‌ముస్సేన్, మాన్‌మౌత్ యూనివర్సిటీ, ఎన్‌బీసీ న్యూస్/సర్వే మంకీలు హిల్లరీదే గెలుపని తేల్చిచెప్పాయి. ఎన్నికల రోజు రాత్రి న్యూయార్క్ టైమ్స్ పత్రిక అంచనా ప్రకారం హిల్లరీకి 85 శాతం గెలుపు అవకాశాలున్నాయని వెల్లడించారు. సీఎన్‌ఎన్ పోల్ ప్రకారం హిల్లరీ 4 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు ఎన్నికలకు రెండ్రోజుల ముందు ప్రకటించారు. అయితే లాస్‌ఏంజెలిస్ టైమ్స్, ఐడీబీ/టీఐపీపీ సర్వేలు మాత్రం ట్రంప్ విజయం సాధిస్తాయని వెల్లడించాయి. ఫైవ్‌థర్టీ ఎయిట్ వెబ్‌సైట్ ట్రంప్‌కు 66 శాతం గెలుపు అవకాశలున్నాయని చెప్పింది.
 
 ఆందోళనలో పలు దేశాలు
 ట్రంప్ గెలుపుతో పలు దేశాలు ఆందోళనలో మునిగిపోయాయి. ట్రంప్ మెజార్టీ సీట్లు వార్త వెలువడగానే ప్రపంచ మార్కెట్లు సైతం కుప్పకూలాయి.‘ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తా, ముస్లింలనుతాత్కాలికంగా అమెరికాలో ప్రవేశించకుండా అడ్డుకోవడంతో పాటు... వలసల్ని నిరోధిస్తా. అమెరికన్లకే ఉద్యోగాలు దక్కేలా చేస్తా’ అంటూ ట్రంప్ చేసిన ఎన్నికల ప్రచారం ఇప్పుడు అనేక మందికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ముస్లిం ప్రపంచం ఆందోళనతో గమనిస్తోంది. ఇతర దేశాల ఉద్యోగులు అమెరికన్ల అవకాశాలు కొల్లగొడుతున్నారంటూ ట్రంప్ ప్రచారంతో భారత్, చైనా, వియత్నాం, లాటిన్ అమెరికా దేశాలు కూడా ఆందోళనలో పడ్డాయి.  ట్రంప్ అభ్యర్థిత్వంపై తొలి నుంచి రిపబ్లికన్ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మహిళలు, వలసవాదులపై చేసిన వ్యాఖ్యల్ని అనేక మంది సీనియర్లు వ్యతిరేకించడంతో పాటు మద్దతిచ్చేందుకు ఒప్పుకోలేదు.

 

>
మరిన్ని వార్తలు