అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం

20 Jan, 2017 22:31 IST|Sakshi
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం

వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాకు 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి మైక్ పెన్స్ బాధ్యతలు స్వీకరించారు. అమెరికా చట్టసభలకు నెలవైన క్యాపిటల్‌ భవనం(వాషింగ్టన్‌ డీసీ) మెట్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేత అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన భార్య మిలానియా, కూతురు ఇవాంకా ట్రంప్, కొడుకు జూనియర్ ట్రంప్ హాజరయ్యారు. రెండు బైబిళ్లపై(ఒకటి తన తల్లి బహుకరించింది, రెండోది 150 ఏళ్ల కిందట అబ్రహాం లింకన్‌ ప్రమాణం చేసింది) చేతులు ఉంచి ప్రమాణం చేశారు.

మాజీ అధ్యక్షులు, సెలబ్రిటీలతో సహా దాదాపు తొమ్మిది లక్షల మంది ప్రజలు ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. గతేడాది నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒకవైపు తీవ్ర విమర్శలు, మరోవైపు సర్వేలన్నీ హిల్లరీకే అధ్యక్షపీఠమని తేల్చేసినా... 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అనే స్లోగన్‌తో అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో 48 శాతం ఓట్లతో విజయం సాధించిన ట్రంప్‌కు 306 ఎలక్టోరల్ ఓట్లు రాగా, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ 232 ఓట్లకే పరిమితమయ్యారు.
(చదవండి: ఇక అమెరికాకు రెండే విధానాలు: ట్రంప్)

మరిన్ని వార్తలు