కాన్యే ప్రకటనపై స్పందించిన ట్రంప్‌

8 Jul, 2020 15:44 IST|Sakshi

వాషింగ్టన్‌: నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ర్యాపర్ కాన్యే వెస్ట్ చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ స్పందించారు. ‘ఇది చాలా ఆసక్తికరంగా’ ఉందని వ్యాఖ్యానించారు. గతంలో ట్రంప్‌కి మద్దతు ప్రకటించిన కాన్యే.. ప్రస్తుతం ఆయనపై పోటీ చేస్తాననడం గమనార్హం. వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ‘కాన్యే పోటీ చేయొచ్చు.. పోటీ చేసిన పక్షంలో.. నాలుగేళ్లలో ఏం జరగబోతుందన్నది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అతనికి పలు రాష్ట్రాల్లో తగినంత ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లేదు’ అన్నారు ట్రంప్‌. 43 ఏళ్ళ కాన్యే.. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే.. సుమారు పది లక్షల మంది లైక్‌ చేశారు. 

2018 లో ఓవల్ ఆఫీసులో ట్రంప్‌ను కలిసిన కాన్యే వెస్ట్.. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అని  నినాదమిచ్చారు. అయితే అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో తను పోటీ చేస్తానని ఈ నెల 4న ప్రకటించినప్పటికీ.. తన ప్రచార వివరాలను గానీ, ఇతర అంశాల గురించి వెల్లడించలేదు. ‘నేను అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నా. దేవున్ని విశ్వసిస్తూ, మ‌న భ‌విష్య‌త్తును మ‌న‌మే నిర్మించుకుంటూ.. అమెరికా పౌరులకు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చుకుందాం’ అని కాన్యే ప్రకటించారు. దాంతో ఆయ‌న‌ ట్రంప్‌, జో బిడెన్‌ల‌కు ప్ర‌త్య‌ర్థిగా గ‌ట్టి పోటీనివ్వ‌నున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. త‌న పోటీకి సంబంధించి క్యానే ఎన్నిక‌ల బ్యాలెట్‌కు ఏదైనా ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారా అనే విష‌యం తెలియరాలేదు. మ‌రోవైపు ప్ర‌ముఖ‌ టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మ‌స్క్ కాన్యే ఎన్నిక‌ల్లో పాల్గొన‌డంపై ఆస‌క్తి క‌న‌బ‌ర్చారు. కాన్యే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే తాను సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం కొత్త చ‌ర్చ‌ను లేవనెత్తింది. (అమెరికా ఎన్నిక‌ల రేసులో హాలీవుడ్ ర్యాప‌ర్)

మరిన్ని వార్తలు