యూఎన్‌లో ట్రంప్‌ ప్రసంగం : గొల్లుమన్న సభ్యులు

27 Sep, 2018 11:18 IST|Sakshi

అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం అంటే ఎలా ఉండాలి. ఎంతో హుందాగా... ఎవరూ కూడా చిన్న శబ్ధం చేయకుండా.. శ్రద్ధతో ఆయన ప్రసంగాన్ని వింటూ ఉండాలి. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రసంగ సమయంలో మాత్రం ఐక్యరాజ్య సమితిలో ఊహించని పరిణామం ఎదురైంది. యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో ట్రంప్‌ ప్రసంగించడం ప్రారంభించగానే..  సభలోని సభ్యులందరూ బిగ్గరగా నవ్వారు. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలో తాము సాధించిన అభివృద్ధిని అమెరికా చరిత్రలో ఏ యంత్రాంగం సాధించలేదని ట్రంప్ చెప్పారు. ఆ సమయంలో సభలోని సభ్యులు గొల్లుమని నవ్వారు. 

ఆ హఠాత్త్‌ పరిణామం ఊహించని ట్రంప్‌, ఒక్కసారిగా మూగబోయారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని, తాను కూడా చిన్నగా నవ్వి... 'ఇలాంటి స్పందన వస్తుందని నేను ఊహించలేదు.. సరే కానీయండి' అన్నారు. అయితే సభలో ట్రంప్‌కు ఎదురైన ఈ ఊహించని పరిణామంపై.. అసలకే అధ్యక్షుడిపై ఓ డేగా కన్నేసే అమెరికన్‌ మీడియా.. ఒక్కోటి ఒక్కోలా రాశాయి. అయితే మీడియా వార్తలపై కూడా ట్రంప్‌ వెంటనే స్పందించారు. ‘అధ్యక్షుడి ట్రంప్‌ను చూసి ప్రజలు నవ్వారు అని రాశారు. వారు నన్ను చూసి నవ్వలేదు. వారు నాతో మంచి సమయాన్ని గడిపారు. మేమందరం కలిసి పనిచేస్తున్నాం’ అని అమెరికా మీడియా అవుట్‌లెట్లను ప్రస్తావిస్తూ.. న్యూయార్క్‌లో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో అన్నారు.  

ఏడాది క్రితం ఈ సభలో తాను తొలిసారి మీ ముందు నిల్చున్నానని... ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి, మెరుగైన భవిష్యత్తు గురించి మాట్లాడానన్నారు. ట్రంప్‌ తన ప్రసంగంలో.. పన్నుల తగ్గింపు, స్టాక్‌మార్కెట్లు రికార్డు స్థాయిలో పెరగడం, డిఫెన్స్‌ నిధుల గురించి మాట్లాడారు. ఉత్తర కొరియాలో అణ్వాయుధాల తయారీ తగ్గిందని ట్రంప్ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు