ప్రాధాన్యహోదా తొలగిస్తాం

6 Mar, 2019 04:39 IST|Sakshi

అమెరికా కాంగ్రెస్‌కు అధ్యక్షుడు ట్రంప్‌ లేఖ

రెండు నెలల్లో అమల్లోకి రానున్న నిర్ణయం

మన దేశంపై పెద్దగా ప్రభావం ఉండదంటున్న ప్రభుత్వం

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: భారత్‌కు వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్‌పీ)ను త్వరలో తొలగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌కు లేఖ అందజేశారు. అమెరికా కాంగ్రెస్, భారత ప్రభుత్వానికి దీనిపై నోటిఫికేషన్‌ ఇచ్చిన 60 రోజుల్లో అమల్లోకి వస్తుంది. ట్రంప్‌ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుందనే విషయం ఇప్పుడు భారత్‌లో చర్చనీయాంశమైంది. అమెరికాకు మన దేశం ఎలాంటి సుంకం చెల్లించకుండా ఏడాదికి రూ.39 వేల కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తోంది. జీఎస్‌పీ హోదా తొలగిస్తే మనం ఆ వస్తువుల ఎగుమతికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

అమెరికా వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్‌ భారత్‌ వస్తువులపై సుంకాలు విధిస్తామని గతంలో పలుమార్లు హెచ్చరించారు. ఇప్పుడు ఏకంగా వాణిజ్య ప్రాధాన్య హోదాను తొలగించడానికే సిద్ధమయ్యారు. అయితే, దీని వల్ల మనకు వచ్చిన నష్టమేమీ లేదని వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్‌ వాద్వాన్‌ అంటున్నారు. జీఎస్‌పీ కింద భారత్‌ రూ.39 వేల కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తే, ఏడాదికి సుమారు రూ.13 వేల కోట్ల ప్రయోజనం కలుగుతోందని ఆయన చెప్పారు. హోదా తొలగింపు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబం«ధాలపై కూడా పెద్దగా ప్రభావం చూపించదని అనూప్‌ అభిప్రాయపడ్డారు.  

ఏమిటీ వాణిజ్య ప్రాధాన్య హోదా?
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడం కోసం జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (జీఎస్‌పీ)ను 1976లో అమెరికా రూపొందించింది. దీని ప్రకారం 129 అభివృద్ధి చెందుతున్న దేశాలను గుర్తించి ఆయా దేశాల నుంచి ఎగుమతి అయ్యే 4,800 రకాల ఉత్పత్తులకు సుంకాలు విధించరాదని నిర్ణయించింది. 1974 వాణిజ్య చట్టం విధివిధానాలకు అనుగుణంగా 1976లో ఈ వాణిజ్య హోదాను ప్రవేశపెట్టింది. ఈ హోదా ద్వారా ఎక్కువ లబ్ధి పొందిన దేశాల్లో భారత్‌ కూడా ఒకటి.

ప్రస్తుతం ప్రతీ ఏడాది 2 వేల రకాల వస్తువుల్ని మనం ఎలాంటి పన్నులు లేకుండా అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం.  అమెరికా విధివిధానాల ప్రకారం వాణిజ్య హోదా అనుభవిస్తున్న దేశం తమ దేశీయ మార్కెట్లలో అమెరికా సులభంగా ప్రవేశించడానికి కూడా వీలు కల్పించాలి. కానీ, భారత్‌ అలాంటి సూత్రాలు పాటించకుండా అమెరికా ఎగుమతులపై అధికంగా పన్నులు విధిస్తోందని ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక ఆరోపణలు చేస్తున్నారు. కొన్నిటి ధరల నియంత్రణ ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.

మరిన్ని వార్తలు