కెనాడా టెక్‌ కంపెనీలకు మేలు చేస్తున్న ట్రంప్ విధానాలు! 

13 Apr, 2018 22:22 IST|Sakshi
అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్

అమెరికా సర్కారు దేశంలోకి వలసొచ్చే ఐటీ, ఇతర రంగాల నిపుణులను కట్టడిచేసే విధానాల అమలు పొరుగున ఉన్న కెనడాకు ప్రయోజనకరంగా మారింది. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు అమెరికాలో పనిచేయడానికి వీలు కల్పించే ప్రత్యేక వీసా కార్యక్రమాలను అధ్యక్షుడు డొనాల్డ్‌ ప్రభుత్వం సమీక్షిస్తూ వాటి కింద తాత్కాలికంగా వలసొచ్చే విదేశీయుల సంఖ్య తగ్గిస్తోంది. వీసా గడువు దాటిన కార్మికులు, సరైన పత్రాలు లేని పొరుగు దేశాలవారిని బలవంతంగా వెనక్కి పంపడం వంటి చర్యలతో టెక్నాలజీ రంగాలకు చెందిన అనేక మంది విదేశీయులు అమెరికా నుంచి నేరుగా కెనడాలో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు.

ట్రంప్ సర్కారు చర్యల వల్ల తమకు, దేశ ఆదాయానికి ఎనలేని నష్టమని మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, యాపిల్‌ వంటి టెక్ దిగ్గజాలు గగ్గోలు పెట్టిన ప్రయోజనం ఉండడం లేదు. అయితే, కెనడాలోని టెక్నాలజీ కంపెనీలు అగ్రరాజ్యం తాజా విధానాలను ఆహ్వానిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు విదేశీ నిపుణులను అనుమతించే విషయంలో కరకుగా వ్యవహరించిన కారణంగా కెనడాలో పెద్ద నగరం టోరంటోలోని టెక్నాలజీ కంపెనీలకు ఉద్యోగాలు కోరుతూ వచ్చే దరఖాస్తులు కిందటేడాది బాగా పెరిగాయి. ఏడాదికి పది లక్షల డాలర్లకు మించిన వార్షికాదాయం వచ్చే 55 టెక్కంపెనీలపై జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

అంతర్జాతీయ అప్లికేషన్లు పెరిగాయి!
2016తో పోల్చితే 2017లో తమ కంపెనీల్లో ఉద్యోగాల కోసం వివిధ దేశాల నుంచి అందే అంతర్జాతీయ దరఖాస్తుల సంఖ్య పెరిగిందని ఈ సర్వేలో పాల్గొన్న 53 శాతం కంపెనీలు తెలిపాయి. వీటిలో 45 శాతం కంపెనీలు విదేశీ ఉద్యోగులను పనిలోకి తీసుకున్నామని వెల్లడించాయని టోరంటో నగరంలో టెక్‌ కంపెనీలకు అవసమైన సౌకర్యాలు కల్పించే మార్స్ డిస్కవరీ డిస్ట్రిక్ట్ అనే సంస్థ జరిపిన ఈ సర్వే వివరించింది. 

కెనడా కంపెనీల్లో విదేశీ టెక్నిపుణులు పెద్ద సంఖ్యలో వచ్చి చేరడానికి అమెరికా వలస విధానాల్లో మార్పులు ఒక్కటే కారణం కాదు. అంతర్జాతీయ స్థాయిలో  ఎక్కువ మంది ఐటీ నిపుణులను ఆకర్షించడానికి త్వరగా వీసాల జారీచేయడం వంటి అనేక సానుకూల అంశాలతో కూడిన కొత్త ‘గ్లోబల్ స్కిల్‌ స్ట్రాటజీ’ని ఇటీవల కెనడా ప్రభుత్వం ప్రారంభించింది. మంచి నైపుణ్యం, ప్రతిభా పాటవాలున్న కార్మికులను కెనడా రప్పించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం కారణంగా ఇండియా, చైనా, బ్రెజిల్, ఇంగ్లండ్, అమెరికా నుంచి  ఉద్యోగులను ఆకట్టుకోవడానికి వీలవుతోంది. 

ఈ కొత్త విధానం వల్ల బాగా చదువుకున్న నిపుణులు కెనడాకు అవసరమైన సంఖ్యలో సునాయాసంగా లభిస్తున్నారు. ఇలా కెనడా టెక్ కంపెనీల్లో చేరుతున్న సిబ్బందిలో నాలుగింట మూడొంతులు ఇంజనీర్లు, డేటా సైంటిస్టులే ఉన్నారు. అమెరికా ఐటీ పరిశ్రమకు కేంద్రస్థానమైన కాలిఫోర్నినియా సిలికాన్‌ వ్యాలీ నుంచి అయాన్ లోగాన్అనే నిపుణుడు టోరంటోకు చెందిన ఓ టెక్నాలజీ కంపెనీలో ఇంజనీరింగ్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్ గా చేరడంతో పాటు తాజా పరిణామాలు కెనడాకు మేలు చేసేలా ఉన్నాయని చెప్పారు. కెనడాతో సంబంధాలున్న దాదాపు పది పదిహేను మంది ఉన్నత స్థాయి టెక్నాలజీ నిపుణులు కూడా కెనడా రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

      - (సాక్షి నాలెడ్జ్ సెంటర్‌)

మరిన్ని వార్తలు