వైరల్‌ : బాహుబలిగా అదరగొట్టిన ట్రంప్‌

23 Feb, 2020 08:58 IST|Sakshi

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బాహుబలి సినిమా చేసిన రచ్చ అంత తేలిగ్గా ఎవరు మరిచిపోరు. బాహుబలి: ది బిగినింగ్ , బాహుబలి : ది కన్‌క్లూజన్‌ అంటూ రెండు భాగాలతో వచ్చిన ఈ సినిమా బారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి సిరీస్‌ దాదాపు 2వేల కోట్లకు పైగా రికార్డు కలెక్షన్స్ సాధించి భారతీయ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే ఇదంతా ఇప్పుడు మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నారనేగా మీ సందేహం.. ఏం లేదండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం(ఫిబ్రవరి 24న) భారతగడ్డ మీద అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. (ట్రంప్‌ విందు.. పసందు..!)

ఈ నేపథ్యంలో ట్రంప్‌ పర్యటనకు ఒక్కరోజు ముందు బాహుబలి టైటిల్ సాంగ్‌తో ట్రంప్‌పై రూపొందించిన ఓ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. దాదాపు నిమిషం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రబాస్‌ ముఖానికి ట్రంప్‌ ముఖాన్ని అతికించి బ్యాక్‌గ్రౌండ్‌లో 'జియోరే బాహుబలి' సాంగ్‌ను పెట్టారు. దీంతో పాటు  ట్రంప్ భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు జూనియర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ను వీడియోలో చూపించారు. అలాగే ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ను తండ్రి ట్రంప్‌ భుజాల మీద ఎత్తుకున్నట్లు చూపించారు. ఇక చివర్లో సినిమాకు శుభం కార్డు లాగా ఈ వీడియోలో కూడా 'యుఎస్ఏ అండ్ ఇండియా యునైటెడ్' అని చూపించడం ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఈ వీడియోపై ట్రంప్‌ స్పందిస్తూ.. 'భారత్‌లో తనకు గొప్ప స్నేహితులు ఉన్నారంటూ' రీట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. 
(హౌడీ X నమస్తే)

కాగా రెండు రోజుల పాటు ఇండియాలో గడపనున్న ట్రంప్‌ సోమవారం(ఫిబ్రవరి 24) న అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం భారీ సందోహం నడుమ దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతీ ఆశ్రమం వద్దకు చేరుకుంటారు.  గాంధీకి అనుబంధంగా ఉన్న సబర్మతీ ఆశ్రమం వద్ద మోదీ, ట్రంప్‌లు కలసి నివాళులు అర్పిస్తారు. అనంతరం ట్రంప్‌కు గాంధీ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను బహూకరించనున్నారు.తర్వాత మొటెరా స్టేడియానికి ట్రంప్, మోదీ కలసి వెళ్తారు. ఇక్కడ జరగనున్న బహిరంగ సభలో దాదాపు 1.25 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారుల అంచనా. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే  పలు కార్యక్రమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. 

మరిన్ని వార్తలు