పారిస్‌ ఒప్పందానికి కట్టుబడ్డాం

9 Jul, 2017 01:00 IST|Sakshi
పారిస్‌ ఒప్పందానికి కట్టుబడ్డాం

జీ20 సదస్సులో సభ్యదేశాల తీర్మానం
హాంబర్గ్‌: గ్లోబల్‌ వార్మింగ్‌పై పోరుకు కట్టుబడి ఉన్నామని జీ20 సదస్సులో భారత్‌ సహా 18 సభ్య దేశాలు స్పష్టం చేశాయి. సదస్సు ముగింపు సందర్భంగా శనివారం అధికారిక ప్రకటనలో ‘పారిస్‌ వాతావరణ ఒప్పందం అమలులో ఎలాంటి మార్పు ఉండదని, అమెరికా మినహా అన్ని దేశాలు సంపూర్ణ మద్దతు తెలిపాయ’ని చెప్పాయి. పారిస్‌ ఒప్పందం నుంచి తప్పుకున్న అమెరికా ఈ సదస్సులో ఒంటరైంది. జీ20 ముగింపు సమావేశం తర్వాత జర్మనీ అధ్యక్షురాలు మెర్కెల్‌ మాట్లాడుతూ ‘పారిస్‌ ఒప్పందంపై అమెరికా తన వ్యతిరేకత కొనసాగించింది. ఇతర సభ్య దేశాలు ఒప్పందానికి గట్టి మద్దతు తెలిపాయ’ని పేర్కొన్నారు.

ప్రకటనలో మరికొన్ని ముఖ్యాంశాలు
‘అవినీతిపై పోరుకు కట్టుబడి ఉన్నాం. అందుకోసం పరస్పర సహకారంతో పాటు సాంకేతిక సాయం అందించుకోవాలి. ఐఎంఎఫ్‌ సంస్కరణల్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు, 2019లోగా కొత్త సంస్కరణల్ని రూపొందించాలి. సమాచార, ప్రసార రంగంలో టెక్నాలజీ దుర్వినియోగం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరం. మార్కెట్‌కు నష్టం కలిగించే సబ్సిడీలకు స్వస్తిచెప్పాలి. అలాగే పారిశ్రామిక రంగంలో అధికోత్పత్తి సమస్యను అధిగమించేందుకు అంతర్జాతీయంగా సహకరించుకోవాల’ని జీ20 దేశాలు పిలుపునిచ్చాయి.

రక్షణ రంగంలో ఆయుధాల చట్టబద్ధ వ్యాపారానికి జీ20 సదస్సు అంగీకారం తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని, స్వేచ్ఛా వాణిజ్య విఫణికి కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. మార్కెట్లలో వివక్ష రూపుమాపాలని, దిగుమతులపై అనవసర పన్నుల్ని తగ్గించాలని, అక్రమ వ్యాపార పద్ధతులకు చెక్‌ చెప్పాలని జీ 20 దేశాలు నిర్ణయించాయి. కాగా పారిస్‌ వాతావరణ ఒప్పందంపై సభ్య దేశాలు ఒత్తిడి తేకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జాగ్రత్త పడ్డారు. దేశాలకు వారి మార్కెట్లను కాపాడుకునే హక్కు ఉందని జీ20 అధికారిక ప్రకటన స్పష్టం చేయడంతో ‘అమెరికా ఫస్ట్‌’ అనే ట్రంప్‌ విధానానికి మార్గం సుగమమైంది. అయితే కర్బన ఇంధనాల్ని పర్యావరణ హితంగా, సమర్థంగా వాడుకునే విషయంలో ఇతర దేశాలతో అమెరికా కలిసి పనిచేయాలని సభ్య దేశాలు అమెరికాకు సూచించాయి.

ఉద్యోగుల వలసల్ని ప్రోత్సహించాలి: మోదీ
జీ20 సదస్సులో డిజిటలైజేషన్, మహిళా సాధికారత, ఉపాధి అంశంపై మోదీ మాట్లాడుతూ.. ఉద్యోగుల వలసల్ని మరింత ప్రోత్సహించాలని, అందువల్ల ఇరు దేశాలు లాభపడతాయని పేర్కొన్నారు. డిజిటల్‌ ప్రపంచంతో ఉపాధి అవకాశాలు పెరిగినా.. ముప్పు ఉందని మోదీ చెప్పారు. తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి సాంకేతికతను భారత్‌ సాధించిందని, మహిళా సాధికారత లేనిదే నిజమైన వృద్ధి సాధ్యం కాదని ప్రధాని పేర్కొన్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్‌ బాగ్లే చెప్పారు.  

ట్రంప్‌ సీట్లో ఇవాంక!
జర్మనీలో జరుగుతున్న జీ–20 సమావేశాల్లో కొద్దిసేపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్థానంలో ఆయన కూతురు ఇవాంక కూర్చున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, బ్రిటన్‌ ప్రధాని థెరెసా తదితరుల సరసన ఇవాంక ఆసీనులయ్యారని వైట్‌హౌస్‌ వర్గాలు చెప్పాయి. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక తన కుటుంబంలోని వారికి, సన్నిహితులకే కీలక పదవులు కట్టబెడుతున్నారన్న ఆరోపణ ఉండటం తెలిసిందే.

మరిన్ని వార్తలు