మోదీ చాలా గొప్పవారు.. మంచివారు: ట్రంప్‌

8 Apr, 2020 14:16 IST|Sakshi
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- భారత ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్‌ ఫొటో)

ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసల వర్షం

వాషింగ్టన్‌: మహమ్మారి కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్న హైడ్రాక్వీక్లోరోక్విన్‌ ఎగుమతి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. విపత్కర పరి​స్థితుల్లో బెదిరింపు ధోరణి సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైతే భారత్‌పై వాణిజ్యపరంగా ప్రతీకార చర్యలు ఉంటాయన్న ట్రంప్‌ తన స్వరం మార్చారు. భారత్‌లో హైడ్రాక్సీక్లోరోక్విన్‌, పారాసిటమోల్‌ అవసరం ఉన్నందు వల్లే వాళ్లు వాటి సరఫరాను నిలిపివేశారని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా యాంటీ మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సహా ఇతర మందుల ఎగుమతులపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాము ముందే ఆర్డర్‌ పెట్టినందు వల్ల హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సరఫరా చేయాల్సిందిగా అమెరికా విజ్ఞప్తి చేసింది.(అలా అయితే భారత్‌పై ప్రతీకారమే: ట్రంప్‌ )

ఈ నేపథ్యంలో అమెరికా సహా కరోనాతో విలవిల్లాడుతున్న ఇతర దేశాలకు మానవతా దృక్పథంతో మందులు సరఫరా చేస్తామని భారత్‌ ప్రకటించింది. ఈ క్రమంలో గుజరాత్‌కు చెందిన మూడు కంపెనీల నుంచి దాదాపు 29 మిలియన్‌ డోసుల డ్రగ్స్‌ అమెరికాకు చేరనున్నట్లు పీటీఐ వెల్లడించింది. ఇక ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన ట్రంప్‌.. ‘‘ 29 మిలియన్ల కంటే ఎక్కువ మొత్తంలో నేను మాత్రలు కొన్నాను. భారత ప్రధాని నరేంద్ర మోదీతో నేను మాట్లాడాను. మాకోసం వాటిని విడుదల చేయాలని కోరాను. ఆయన చాలా గొప్పవారు. చాలా చాలా మంచి వారు’’అంటూ ఫాక్స్‌న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. (ఆ దేశాలకు ఎగుమతి చేస్తాం: భారత్‌)

కాగా చైనాలోని వుహాన్‌ నగరంలో బయటపడ్డ ప్రాణాంతక కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచమంతా వణికిపోతోంది. ఇటలీ, స్పెయిన్‌ తర్వాత అగ్రరాజ్యం అమెరికాలో ఎక్కువగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. అమెరికాలో ఇప్పటికే 12 వేల మందికి పైగా మహమ్మారికి బలికాగా.. లక్షలాది మంది దాని బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు హైడ్రాక్వీక్లోరోక్విన్‌ సరఫరా చేసి తమకు సాయం చేయాల్సిందిగా ట్రంప్‌ మోదీని అభ్యర్థించారు. అయితే వాటినై నిషేధం విధించారన్న విషయం తెలుసుకుని తొలుత తొందరపడిన ట్రంప్‌... బెదిరింపు ధోరణి అవలంబించారు. ఇక మందులు తమ దేశానికి చేరడంతో ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎంతైనా ఆయన ట్రంప్‌ కదా..!(డబ్ల్యూహెచ్‌ఓను హెచ్చరించిన ట్రంప్‌!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు