అందుకే నాపై దుష్ప్రచారం: చైనాపై ట్రంప్‌ ఆగ్రహం

21 May, 2020 13:51 IST|Sakshi

చైనాపై మరోసారి మండిపడ్డ అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలిందంటూ చైనాపై నిప్పులు చెరుగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి డ్రాగన్‌ దేశంపై మండిపడ్డారు. చైనీయుల ఆటలు సాగనివ్వకుండా చేస్తున్న కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించేందుకు దుష్ప్రచారానికి వారు తెరతీశారంటూ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ‘‘నిద్రమత్తులో ఉండే జో బిడెన్‌ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే అమెరికాను విచ్ఛిన్నం చేసేందుకు మార్గం సుగమం అవుతుంది కాబట్టి అతడిని గెలిపించేందుకు చైనా నా గురించి భారీ దుష్ప్రచారానికి పూనుకుంది. నేను వచ్చేంత వరకు దశాబ్దాల తరబడి ఇదే తీరు కొనసాగించింది కదా’’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. (5జీ నెట్‌వర్క్‌: అమెరికా కీలక ముందడుగు)

ఇక కరోనా గురించి చైనా తప్పుడు సమాచారం ఇస్తోందన్న ట్రంప్‌.. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక వైరస్‌ను వ్యాపింపజేసిన చైనా తరఫున వారి అధికార ప్రతినిధి బుద్ధిహీనమైన వ్యాఖ్యలు చేస్తారు. వారి వల్ల ప్రపంచ ప్రజానీకం పడుతున్న బాధ, కరోనా సృష్టించిన మారణహోమాన్ని తక్కువ చేసి చూపుతారు.  పైగా అమెరికా, యూరప్‌ గురించి తప్పుడు ప్రచారం చేయడం అవమానకరం. ఇదంతా ఉన్నతస్థాయి వ్యక్తుల ఆదేశాల మేరకే జరుగుతోంది. వాళ్లు తలచుకుంటే ప్లేగును సులభంగా అరికట్టగలిగేవాళ్లు. కానీ అలా చేయలేదు’’అని పరోక్షంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై విమర్శలు గుప్పించారు. (అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోం: చైనా)

కాగా ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్‌.. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించేందుకు చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. వ్యాపార, వాణిజ్య, ఇతరత్రా ప్రయోజనాల కోసం డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌కు చైనా సాయం చేసే అవకాశాలు ఉన్నాయని తాను విశ్వసిస్తున్నానన్నారు. అయితే చైనా మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఆసక్తి తమకు లేదని.. ఒక దేశ అంతర్గత వ‍్యవహారాల్లో తలదూర్చాల్సి అవసరం తమకు లేదని కౌంటర్‌ ఇచ్చింది.

>
మరిన్ని వార్తలు