మీడియానే అమెరికన్ల శత్రువు

19 Feb, 2017 01:22 IST|Sakshi
మీడియానే అమెరికన్ల శత్రువు

న్యూయార్క్‌టైమ్స్, ఎన్‌బీసీ, సీఎన్‌ఎన్‌లు ఫేక్‌ న్యూస్‌ మీడియా
నా పాలనపై చాలామంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: ట్రంప్‌
ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామని ప్రకటన


వాషింగ్టన్‌: మీడియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి విరుచుకుపడ్డారు. మీడియా అమెరికా ప్రజల శత్రువని వ్యాఖ్యానించారు. ‘ఫేక్‌ న్యూస్‌ మీడియా (న్యూయార్క్‌టైమ్స్, ఎన్‌బీసీన్యూస్, ఏబీసీ, సీబీఎస్, సీఎన్‌ఎన్‌) నా శత్రువు కాదు. అమెరికా ప్రజల శత్రువు’అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. తన పాలన సజావుగా సాగుతోందని, నిజాయితీ లేని మీడియా చెపుతున్నట్టుగా వైట్‌హౌస్‌లో ఎటువంటి ఘర్షణ వాతావరణం లేదన్నారు. వైట్‌హౌస్‌లో గందరగోళం చెలరేగుతోందని మీడియాలో వస్తున్న కథనాలతో టీవీ చానల్స్‌ పెట్టాలన్నా.. వార్తా పత్రికలు చదవాలన్నా ఇబ్బందిగా ఉందని చెప్పారు.

మీడియాపై ఆగ్రహంగా ఉన్న ట్రంప్‌ తన భావాలను వ్యక్తపరిచేందుకు ట్వీటర్, ఫేస్‌బుక్‌లాంటి సామాజిక వెబ్‌సైట్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. తన పాలన, పనితీరుపై చాలా మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అయితే తన రాజకీయ ప్రత్యర్థులు, మీడియా మాత్రం అసంతృప్తిగా ఉందని ఆరోపించారు. గత అమెరికా అధ్యక్షులు చాలా మంది మీడియాను విమర్శించినా.. ఇలా బహిరంగంగా ఆరోపణలు చేసింది మాత్రం ట్రంపే కావడం గమనార్హం.  ఇదేసమయంలో ఫాక్స్‌ న్యూస్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో మీడియాకంటే వైట్‌ హౌస్‌ నిజాయితీ కలిగినదని భావిస్తున్న వారి సంఖ్య 45 శాతం నుంచి 42 శాతానికి తగ్గడం గమనార్హం.

ఇజ్రాయెల్‌ ప్రధానికి ఆహ్వానం
ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొని తుదముట్టిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. తన ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రేడియో, వెబ్‌ ద్వారా ట్రంప్‌ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజిమన్‌ నెతాన్యాహును అమెరికాకు ఆహ్వానించినట్టు ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రకటించారు. ఇజ్రాయెల్‌తో కలసి పనిచేస్తామని, వారి భద్రత, స్థిరత్వానికి కృషి చేస్తామని చెప్పారు. అమెరికా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని, ప్రజలకు ఇబ్బందిగా మారిన రెండు వృథా నిబంధనలను తొలగించామని వెల్లడించారు.

నిక్కీ హేలి సమర్థంగా పనిచేస్తున్నారు..
ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఉన్న భారతీయ–అమెరికన్‌ నిక్కీహేలీ సమర్థంగా పనిచేస్తున్నారని ట్రంప్‌ కొనియాడారు. అమెరికాలో ఒక భారతీయ–అమెరికన్‌ కేబినెట్‌ స్థాయి పదవిని దక్కించుకున్న మొదటి వ్యక్తి నిక్కీహేలీనే కావడం తెలిసిందే. ఆమె కొద్ది వారాలుగా కొత్త పదవిలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా హేలీ గురించి ట్రంప్‌ మాట్లాడుతూ.. మన కోసం సమర్థంగా పనిచేస్తున్న సౌత్‌ కరోలినా మాజీ గవర్నర్‌ నిక్కీహేలీకి ధన్యవాదాలు అని చెప్పారు. అమెరికా రాయబారిగా ఆమె ఐక్యరాజ్యసమితిలో సమర్థవంతంగా పనిచేస్తు న్నారని కితాబిచ్చారు.