మమ్మల్ని చాలా సార్లు బెదిరించాడు: ట్రంప్‌

2 Aug, 2019 08:55 IST|Sakshi

వాషిం‍గ్టన్‌ : అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ కుమారుడు హంజా లాడెన్‌ హతమైనట్లు అమెరికా మీడియా కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, శ్వేతసౌధ వర్గాలు ఈ విషయంపై నోరు మెదపలేదు. దీంతో హంజా హతం వెనుక అమెరికా హస్తం ఉందా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ...హంజా ఎన్నోసార్లు తమ దేశం గురించి చాలా నీచంగా మాట్లాడేవాడని అన్నారు. అదే విధంగా అగ్రరాజ్యం అంతుచూస్తానంటూ బెదిరించేవాడని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతానికి హంజా మృతి విషయమై మాత్రం తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని పేర్కొన్నారు.

కాగా హంజా బిన్‌ లాడెన్‌ హతమైనట్లు అమెరికాకు చెందిన ఎన్‌బీసీ న్యూస్‌ చానల్‌, న్యూయార్క్‌ టైమ్స్‌ సంచలన కథనాలు వెలువరించాయి. హంజా మృతి చెందాడని అమెరికా ఇంటలెజిన్స్‌ అధికారులు తెలిపినట్లు పేర్కొన్నాయి. గత రెండేళ్లుగా సాగుతున్న ఓ ఆపరేషన్‌లో భాగంగా హంజా హతమైనట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఇక పాకిస్తాన్‌లోని అబోతాబాద్‌లో తలదాచుకున్న బిన్‌ లాడెన్‌ను 2011లో అమెరికా సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఒసామా 20 మంది పిల్లల్లో 15వ వాడైన హంజా ఆల్‌ఖైదా నాయకత్వానికి వారసుడిగా ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి.  తండ్రి బిన్‌ లాడెన్‌ మరణానంతరం అల్‌ఖైదాలో హంజాకు సీనియర్‌ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సన్నద్ధమవుతున్నట్లు పలు రిపోర్టులు నివేదించాయి. దీంతో అతడి కోసం అమెరికా గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. అయితే జిహాద్‌ రాజకుమారుడిగా చెప్పుకునే 29 ఏళ్ల హంజా జాడ కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత అతడు పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడని, అనంతరం అఫ్గనిస్తాన్‌, సిరియాల్లో ఉన్నాడని ప్రచారం జరిగింది.

ఈ క్రమంలో హంజాను ఇరాన్‌ గృహ నిర్బంధంలో ఉంచిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని సిరియాలో నరమేధం సృష్టించిన ఐసిస్‌ తరహాలో అటు బిన్‌ లాడెన్‌ హత్యపై ప్రతీకారం.. ఇటు జిహాద్‌ విస్తరణకు హంజా సన్నద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో హంజా ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్‌ డాలర్లు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు