భారత్‌- చైనా వివాదం: మధ్యవర్తిత్వానికి సిద్ధం!

27 May, 2020 18:12 IST|Sakshi

భారత్‌- చైనా వివాదం: మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న ట్రంప్‌

వాషింగ్టన్‌: భారత్‌- చైనా సరిహద్దు వివాద పరిష్కారానికై మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘సరిహద్దులో వివాదం రేగుతున్న తరుణంలో మధ్యవర్తిత్వం వహించడానికి యూఎస్‌ సుముఖంగా ఉన్నట్లు భారత్‌, చైనాలకు సమాచారం ఇచ్చాం. ధన్యవాదాలు’’ అని ట్రంప్‌ బుధవారం ట్వీట్‌ చేశారు. కాగా వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌- చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తిని విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రతరమవుతున్నాయి.(వారంలోగా చైనాపై కఠిన చర్యలు: ట్రంప్‌)

ఈ నేపథ్యంలో మంగళవారం సైన్యాధికారులతో జరిగిన సమావేశంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌.. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే క్రమంలో యుద్ధ సన్నద్ధతను పెంచుకోవాలని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ), పీపుల్స్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌కు పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక హాంకాంగ్‌ను పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం, తైవాన్‌పై పెత్తనం చెలాయించేందుకు డ్రాగన్‌ ప్రయత్నాలు చేస్తుండటం సహా భారత సరిహద్దుల్లో చైనా సైన్యం పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో జిన్‌పింగ్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్‌.. సరిహద్దుల వద్ద పరిస్థితులను ఇరు దేశాధినేతలు నిశితంగా పరిశీలిసస్తున్నారని, చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని సంకేతాలు ఇవ్వడం విశేషం. మరోవైపు భారత్‌ సైతం చైనాకు ధీటుగా సమాధానం చెబుతూనే.. చర్చల కోసం ‘డోక్లాం టీం’ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. (చైనా దూకుడు: మళ్లీ అదే టీం రంగంలోకి?!)

కరోనా: ట్రంప్‌ మాట నిజమైంది!

కొత్త మ్యాపులు: వెనక్కి తగ్గిన నేపాల్‌?!

మరిన్ని వార్తలు