హిల్లరీవైపే పుతిన్‌ మొగ్గుచూపారు

13 Jul, 2017 22:53 IST|Sakshi
హిల్లరీవైపే పుతిన్‌ మొగ్గుచూపారు

డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా తనకు అనుకూలంగా వ్యవహరించిందన్న ఆరోపణలను డోనాల్డ్‌ ట్రంప్‌ కొట్టిపారేశారు. నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హిల్లరీ క్లింటనే అధ్యక్షురాలు కావాలని కోరుకున్నారని ప్రకటించారు. ఆమెకు అధికారం వస్తే అమెరికా బలహీనమవుతుందని అంచనా వేశారని వెల్లడించారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తను, పుతిన్‌ తమ దేశాల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. జర్మనీ నగరం హాంబర్గ్‌లో గత వారం నిర్వహించిన జీ–20 సదస్సులో వీరిద్దరూ భేటీ కావడం తెలిసిందే. ‘మా సైన్యం బలోపేతానికి నేను అధికశ్రద్ధ చూపాను. హిల్లరీ అధికారంలోకి వచ్చి ఉంటే సైన్యం బలహీనంగా మారేది. ఇంధనం ధర మరింత పెరిగేది. అందుకే ట్రంప్‌ నన్ను వ్యతిరేకించారు’ అని వివరించారు.

గ్రీన్‌కార్డు నిబంధనలను సరళీకరించండి
న్యూయార్క్‌: అమెరికాలో నివసించే భారతీయ ఉద్యోగులు/వ్యాపారులు శాశ్వత నివాసానికి ఉద్దేశించిన గ్రీన్‌కార్డ్‌ పొందాలంటే 12 ఏళ్ల పాటు నిరీక్షించాలంటూ వచ్చిన వార్తలపై అమెరికా నేతలు స్పందించారు. దీనికి సంబంధించి ఒక బిల్లును కాన్సస్‌ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ నేత కెవిన్‌ యోడర్‌ ప్రవేశపెట్టారు. ఈ సమస్యకు కారణమైన ‘దేశ ఆధారిత’ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నిబంధన ఉండటం వల్ల భారత్, చైనా వంటి అధిక జనాభా దేశాల నుంచి వచ్చే వారికి అన్యాయం జరుగుతోందని ఆయన వివరించారు. కాంగ్రెస్‌లో ఉన్న 230 మందిలో ఇప్పటికే 100 మందికి పైగా నేతలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు.

ఈ బిల్లు ఆమోదం పొందితే ‘దేశ ఆధారిత గ్రీన్‌కార్డ్‌ జారీ’ నిబంధనని తొలగిస్తారు. ప్రస్తుతం ఈ నిబంధనల ప్రకారం స్వతంత్ర దేశం నుంచి వచ్చిన ఉద్యోగుల కుటుంబాలకు కోటా ప్రకారం గ్రీన్‌కార్డులు మం జూరు చేయాలి.  దీంతో భారత్, చైనాల నుంచి వచ్చిన వారితో సమానంగా చిన్న దేశం గ్రీన్‌లాండ్‌ నుంచి వచ్చిన ఉద్యోగులకూ గ్రీన్‌కార్డులు అందుతున్నాయి. పెద్ద దేశాల నుంచి దరఖాస్తుదారులు ఎక్కువగా ఉండటంతో ప్రతి సంవత్సరం వారి గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అలాగే ఈ బిల్లు అమలులోకి వస్తే తాత్కాలిక వీసా మీద అమెరికాలో పనిచేసే వారికి కూడా మరింత ప్రయోజనం   చేకూరనుంది.

ట్రంప్‌ అభిశంసనకు తీర్మానం
అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి అనుమతించి న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించినందున ట్రంప్‌ను అభిశంసించాలని కోరుతూ డెమోక్రాట్‌ ఎంపీ బ్రాడ్‌ షెర్మన్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. మరో డెమోక్రాట్‌ సభ్యుడు అల్‌ గ్రీన్‌ దీనిపై సంతకం చేశారు. అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. పార్లమెంటులో రిపబ్లికన్ల ప్రాబల్యం ఉన్నందున ఈ తీర్మానాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. డెమోక్రాట్లకు ప్రతినిధుల సభలో తగిన మెజారిటీ లేకపోవడమే ఇందుకు కారణం.

మరిన్ని వార్తలు