రేపే ప్రకటన.. ఆత్మరక్షణ కోసమే

8 Jan, 2020 08:59 IST|Sakshi

వాషింగ్టన్‌/టెహ్రాన్‌: అగ్రరాజ్యం అమెరికా- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరుకున్నాయి. తమ జనరల్‌ ఖాసిం సులేమానీని హతమార్చినందుకు గానూ ఇరాన్‌.. ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. పన్నెండు బాలిస్టిక్‌ క్షిపణులతో అమెరికా వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. కాగా ఇరాన్‌ చర్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. అంతేగాకుండా యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలు జారీ చేశారు.

ఈ మేరకు.. ‘అంతా బాగుంది! ఇరాక్‌లో ఉన్న రెండు సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ఇదంతా చాలా బాగుంది! ప్రపంచంలో ఎక్కడలేనటువంటి.. అత్యంత శక్తిమంతమైన మిలిటరీ వ్యవస్థ మా దగ్గర ఉంది! రేపు ఉదయం నేను ఓ ప్రకటన చేస్తాను’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.  (అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు.. ఈ విరోధం నేటిది కాదు

ఆత్మరక్షణ కోసమే: ఇరాన్‌
ఇరాక్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణి దాడి చేయడాన్ని ఇరాన్‌ సమర్థించుకుంది. ఆత్మరక్షణ కోసమే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపింది. ఈ మేరకు ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌ జరీఫ్‌ మాట్లాడుతూ.. ‘ఐక్యరాజ్య సమితి చార్టర్‌ ఆర్టికల్‌ 51 ప్రకారం... మా పౌరులు, సీనియర్‌ అధికారులపై పిరికిపంద దాడులు చేసిన వారి నుంచి ఆత్మరక్షణ కోసమే ఈ చర్యకు పూనుకున్నాం. అంతేగానీ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. అయితే మాకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడుల నుంచి మమ్మల్ని మేము కాపాడుకునేందుకు ఏ అవకాశాన్ని వదులుకోం’అని స్పష్టం చేశారు.(52తో పాటు.. 290 కూడా గుర్తుపెట్టుకో ట్రంప్‌! )

మరిన్ని వార్తలు