కిమ్‌కు ట్రంప్‌ ఆత్మీయ సందేశం!

10 Jan, 2020 18:54 IST|Sakshi

సియోల్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. ఆయన ఎప్పుడు ఎలా స్పందిస్తాడో అర్థం చేసుకోవడం కష్టమే. తాజాగా ట్రంప్‌ ఉత్తర కొరియా నాయకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు బర్త్‌డే సందేశాన్ని పంపారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు చుంగ్ ఐ-యోంగ్ మీడియాకు వెల్లడించారు. దక్షిణ కొరియాలో చుంగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ కొద్ది రోజుల కిందట వాషింగ్టన్‌లో ట్రంప్‌ను కలిశాను. నేను ట్రంప్‌ను కలిసిన రోజు కిమ్‌ పుట్టినరోజు. నాకు ఆ విషయం గుర్తుచేసిన ట్రంప్‌.. ఆయనకు బర్త్‌డే విషెస్‌ పంపాల్సిందిగా కోరారు. దీంతో ఆ సందేశాన్ని నేను ఉత్తర కొరియాకు చేరవేశాను’ అని చెప్పారు. అయితే అది రాతపూర్వక సందేశమా, బర్త్‌డే విషెస్‌తో మరేదైనా ఉందా అనే దానిపై చుంగ్‌ స్పష్టత ఇవ్వలేదు. ఈ సందర్భంగా మధ్య ప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై కూడా ట్రంప్‌, చుంగ్‌ చర్చించినట్టుగా సమాచారం.

అయితే జనవరి 8 కిమ్‌​ బర్త్‌డేగా అందరు భావిస్తున్నారు. కానీ కిమ్‌ యంత్రాంగం మాత్రం ఆ విషయాన్ని ధ్రువీకరించలేదు. అమెరికా మాత్రం కిమ్‌ 1984లో జన్మించినట్టు పేర్కొంటుంది. కాగా, గతంలో ట్రంప్‌, కిమ్‌లు మూడు సార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే. తొలిసారి సింగపూర్‌లో భేటీ అయిన ఇరువురు నేతలు.. ఆ తర్వాత వియత్నాంలో సమావేశమయ్యారు. మూడో సారి వీరి భేటీ ఉత్తర, దక్షిణ కొరియాల సరిహద్దుల్లోని నిస్సైనిక మండలం (డీఎంజెడ్‌)లో జరిగింది. ఈ భేటీ కోసం ట్రంప్‌ మొదటిసారి ఉత్తర కొరియాలో కాలుపెట్టారు. దీంతో ఉత్తర కొరియాలో అడుగుపెట్టిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ నిలిచారు. దీంతో ఈ భేటీ చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా కిమ్‌ను అమెరికాకు ఆహ్వానించినట్టు ట్రంప్‌ చెప్పారు. కిమ్‌ రావాలనుకుంటే ఎప్పుడైనా అమెరికాకు రావచ్చని ట్రంప్‌ వెల్లడించారు. అయితే ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

మరిన్ని వార్తలు