సోషల్‌ మీడియాపై ట్రంప్‌ ఆంక్షలు!

30 May, 2020 04:37 IST|Sakshi
ఉత్తర్వుపై సంతకం చేయడానికి ముందు న్యూయార్క్‌ పోస్ట్‌ను విమర్శిస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌

సంబంధిత ఉత్తర్వుపై సంతకం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సామాజిక మాధ్యమాలపై కొరడా ఝళిపించారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వచ్చే సమాచారం నుంచి కంపెనీలకు ఉన్న చట్టపరమైన రక్షణను తొలగించే ఉత్తర్వులపై ట్రంప్‌ గురువారం సంతకం చేశారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్‌ జోక్యం చేసుకుంటోందని ఆరోపించిన ఒక రోజులోనే ట్రంప్‌ ఈ చర్యకు దిగడం గమనార్హం. అంతకుముందు మెయిల్‌–ఇన్‌ బ్యాలెట్‌ పేపర్ల కారణంగా ఎన్నికల్లో అక్రమాలు జరుగుతాయన్న ట్రంప్‌ ట్వీట్‌ విషయంలో నిజానిజాలు సరిచూసుకోవాలని సూచిస్తూ ట్విట్టర్‌ నీలి రంగు ఆశ్చర్యార్థకాన్ని తగిలించడం.. దానిపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ‘‘అమెరికన్ల వాక్‌స్వాతంత్య్రాన్ని కాపాడేందుకు, రక్షించేందుకు వీలుగా ఈ రోజు కొన్ని ఉత్తర్వులపై సంతకం చేశాను. ప్రస్తుతం ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమ దిగ్గజాలకు అసాధారణమైన రీతిలో చట్టపరమైన రక్షణ లభిస్తోంది. కంపెనీ తటస్తంగా ఉంటుందన్న సిద్ధాంతం ఆధారంగా ఈ రక్షణ కల్పించారు’’అని ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.  అమెరికా వాణిజ్యాన్ని ఏ రకంగానైనా దెబ్బతీసే చర్యలకు దిగితే సామాజిక మాధ్యమాలను నిషేధించేలా ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌కు అధికారాలు కల్పించారు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు