పత్రికలపై ట్రంప్ మండిపాటు

14 Nov, 2016 16:17 IST|Sakshi
పత్రికలపై ట్రంప్ మండిపాటు
అగ్రరాజ్యం అమెరికాకు తాను అధ్యక్షుడిగా ఎన్నికైనా.. అసలు ఆ విషయం గురించిన కవరేజి చాలా దారుణంగా ఉందని న్యూయార్క్ టైమ్స్ పత్రికపై డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తన గురించి సరిగా కవరేజి చేయనందువల్ల ఆ పత్రిక వేలాది మంది పాఠకులను కోల్పోతోందని చెప్పారు. తన గురించి సరిగా కవరేజి చేయనందుకు క్షమాపణలు చెబుతూ పాఠకులకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక లేఖ కూడా పంపిందని, కనీసం ఇప్పుడైనా ఆ పత్రిక తన తీరు మార్చుకుంటుందో లేదో అనుమానమేనని ఆయన అన్నారు. ఈ మేరకు ట్రంప్ ట్వీట్లు చేశారు. ప్రధాన స్రవంతి మీడియా తన గురించిన కవరేజి విషయంలో చాలా పక్షపాతంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రచారం సమయంలో కూడా మీడియాను ఆయన అత్యంత అవినీతిపరమైనదంటూ ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. 
 
వాషింగ్టన్ పోస్ట్, సీఎన్ఎన్ లాంటి సంస్థలపై కూడా ట్రంప్ గతంలో పలు ఆరోపణలు చేశారు. సీఎన్ఎన్ అయితే క్లింటన్ న్యూస్ నెట్‌వర్క్‌లా మారిపోయిందని ఆయన విమర్శించారు. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ పత్రికపై మండిపడినా, ఏ కథనంలో తన గురించి సరిగా చెప్పలేదో మాత్రం ఆయన ఎక్కడా వివరించలేదు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ తన ట్వీట్ల విషయంలో కాస్త సంయమనం పాటిస్తారని పీబీఎస్ న్యూస్ సంస్థ తెలిపినా, అంతలోనే ఈ కొత్త ట్వీట్లు రావడం గమనార్హం. ప్రధాన స్రవంతి మీడియాలో తన గురించి కవరేజి రాకపోయినా.. సోషల్ మీడియా తనకు అండగా ఉందని, తనకు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారని ఆయన అన్నారు. ఇది చాలా అత్యాధునికమైన కమ్యూనికేషన్ సాధనమని, అందువల్ల పత్రికల్లో సరిగా రాకపోయినా పెద్దగా నష్టం లేదని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మొత్తం తాను ఖర్చుపెట్టిన డబ్బుల వల్ల వచ్చిన ఫలితం కంటే.. సోషల్ మీడియా వల్ల వచ్చిందే ఎక్కువని తాను భావిస్తున్నానన్నారు. 
మరిన్ని వార్తలు