బ్లూమ్‌బర్గ్‌ ‘పిజ్జా’ వీడియో.. ట్రంప్‌ సెటైర్లు!

5 Mar, 2020 12:32 IST|Sakshi

వాషింగ్టన్‌: తన రాజకీయ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముందు వరుసలో ఉంటారన్నది తెలిసిన విషయమే. అవకాశం దొరికితే చాలు తన మాటల తూటాలు, సెటైరికల్‌ ట్వీట్లతో ఎదుటివారిపై విరుచుకుపడతారు. ప్రస్తుతం ట్రంప్‌కు అలాంటి అవకాశమే ఇచ్చి అడ్డంగా బుక్కయ్యారు డెమొక్రాట్‌ పార్టీకి చెందిన మైఖేల్‌ బ్లూమ్‌బర్గ్‌. పిజ్జా ముక్కను కొరికి తిన్న మైఖేల్‌... తర్వాత దానిని మళ్లీ బాక్సులో పెట్టిన వీడియోను బ్లూమ్‌బర్గ్‌ స్నాప్‌చాట్‌ హ్యాండిల్‌ షేర్‌ చేసింది. ఇందులో... పిజ్జాను రుచిచూసిన తర్వాత మైఖేల్‌ తన ఐదు చేతివేళ్లను నోట్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా జుర్రుకున్నట్లుగా కనిపించింది. (తాలిబన్‌ అగ్రనేతకు ట్రంప్‌ ఫోన్‌)

ఇక ఈ వీడియోపై ట్రంప్‌ తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. ‘‘మినీ మైక్‌.. నీ మురికైన చేతివేళ్లను అలా నోట్లో పెట్టుకోవద్దు. ఇది అపరిశుభ్రం. నీతోపాటు ఇతరులకు కూడా చాలా ప్రమాదకరం’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ట్రంప్‌ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ సైతం ఈ వీడియోపై స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రకంపనలు రేగుతున్న నేపథ్యంలో.. ‘‘ ఇది నిజంగా చెత్త విషయం. బ్లూమ్‌బర్గ్‌ ఎలాంటి వారో ఇందులో కనబడుతోంది. మైక్‌ నాకు 1,000,000,000 డాలర్లు పంపించండి. సోషల్‌ మీడియా ఎలా ఉపయోగించాలో చెప్తా’’ అంటూ కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసే విధానం ఇదే అని మైఖేల్‌ వీడియోను షేర్‌ చేశారు.(కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని!

కాగా వాణిజ్య సమాచారంతో పాటు వార్తలు అందించడంలోనూ ముందుండే ‘బ్లూమ్‌బర్గ్‌’ ను స్థాపించి మీడియా మొఘల్‌గా మైఖేల్‌ బ్లూమ్‌బర్గ్‌ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు డెమొక్రాట్ల నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశించారు. ఇందులో భాగంగా ట్రంప్‌ విధానాలను ఎండగడుతూ తన ప్రసంగాలతో దూసుకపోయారు. ట్రంప్‌ను ఓడించడమే లక్ష్యంగా పోటీలో దిగినట్లు పేర్కొన్నారు. అయితే బుధవారం నాటితో మైఖేల్‌ ప్రచారం ముగిసింది. తగినన్ని ఓట్లు రాకపోవడంతో ఆయన అధ్యక్ష పదవి అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకొన్నారు. డెమొక్రటిక్‌ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ను అభ్యర్థిగా ప్రతిపాదించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసి.. గెలుపొందే అవకాశాలు బిడెన్‌కే ఎక్కువగా ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా