డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేస్తాం: ట్రంప్‌

8 Apr, 2020 11:10 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రపంచమంతా కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు నిధులు నిలిపివేస్తామని హెచ్చరించారు. డబ్ల్యూహెచ్‌ఓ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని.. ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌.. ‘‘ డబ్ల్యూహెచ్‌ఓకు ఖర్చు పెట్టే నిధులను నిలిపివేయబోతున్నాం. ఇది కేవలం మాటలకే పరిమితం కాదు. నేను చెప్పింది చేయబోతున్నా. అంతేకాదు పూర్తిగా ఫండింగ్‌ ఆపేసే ఆలోచన కూడా ఉంది. అమెరికానే నా మొదటి ప్రాధాన్యం’’అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇక కరోనా వైరస్‌ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో చైనా అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ సిఫారసులను తాను తిరస్కరించి మంచి పని చేశానన్నారు. ‘‘డబ్ల్యూహెచ్‌ఓ అమెరికా నుంచి పెద్ద మొత్తంలో నిధులు తీసుకుంటోంది. ప్రయాణాలపై నేను నిషేధం విధించినపుడు వారు నన్ను విమర్శించారు. నా నిర్ణయాలతో ఏకీభవించలేదు. వాళ్లు చాలా విషయాల్లో తప్పుగా వ్యవహరిస్తున్నారు. చైనాకు మద్దతుగా నిలుస్తున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. (చైనా- అమెరికా మాటల యుద్ధం.. డబ్ల్యూహెచ్‌ఓపై విమర్శలు)

కాగా ప్రపంచవ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తున్న కోవిడ్‌-19 చైనాలోని వుహాన్‌ పట్టణంలో తొలిసారిగా బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా చైనా వల్లే ఇదంతా జరిగిందంటూ మాటల యుద్ధానికి దిగింది. చైనా సైతం ఇందుకు కౌంటర్‌గా అమెరికా సైనికులే ఈ వైరస్‌ను తమ దేశంలోకి తీసుకువచ్చారంటూ ఎదురుదాడి చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రేయేసస్‌ చైనాలో పర్యటించిన విషయాన్ని అమెరికాలో అధికారంలో ఉన్న రిపబ్లికన్లు తెరపైకి తీసుకువచ్చారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో చైనా నాయకత్వం గొప్పగా పనిచేసిందని టెబ్రోస్‌ ప్రశంసించడాన్ని ఆక్షేపించారు. (అలా అయితే భారత్‌పై ప్రతీకారమే: ట్రంప్‌ )

ఇక అప్పటి నుంచి చైనా లక్ష్యంగా ట్రంప్‌ సహా ఇతర నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరును సైతం తప్పుబడుతున్నారు. కాగా ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ డబ్ల్యూహెచ​ఓకు అత్యధిక నిధులు అమెరికా నుంచే సమకూరుతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయకుండా.. దాని వ్యాప్తికి కారణమైన చైనాను వెనకేసుకొస్తున్నారన్న ఆరోపణలతో అమెరికా డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు ఆపేస్తామని తాజాగా బెదిరింపులకు దిగింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు