చైనా నిజ స్వరూపం ఇదే: ట్రంప్‌ 

3 Jul, 2020 04:28 IST|Sakshi

చైనా అధికార కమ్యూనిస్ట్‌ పార్టీది ఆక్రమణపూరిత వైఖరి 

వాషింగ్టన్‌: భారత్‌తో చైనా వ్యవహరిస్తున్న దుందుడుకు వైఖరితో చైనా అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ నిజరూపం స్పష్టంగా తెలుస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిప్రాయపడుతున్నట్లు ఆయన ప్రెస్‌ సెక్రటరీ పేర్కొన్నారు. భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను అమెరికా నిశితంగా గమనిస్తోందని, ఆ వివాదం  శాంతియుతంగా పరిష్కారమవ్వాలనే తాము కోరుకుంటున్నామని వైట్‌హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ కేలీ మెక్‌ఎనానీ వ్యాఖ్యానించారు. భారత్‌ సహా పలు దేశాలపై చైనా అనుసరిస్తున్న ఆక్రమణపూరిత వైఖరిని ట్రంప్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఆ వైఖరి చైనాలో  అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా అసలు స్వరూపాన్ని తేటతెల్లం చేస్తోందని ఆయన భావిస్తున్నారని కేలీ మెక్‌ఎనానీ తెలిపారు. అమెరికా కాంగ్రెషనల్‌ సమావేశంలోనూ భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తమైంది.

‘చైనా తీరుతో ఇటీవల వాస్తవాధీన రేఖ వెంట తీవ్ర హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఆ ఘర్షణల్లో పెద్ద సంఖ్యలో భారతీయ సైనికులు చనిపోయారు. చైనా వైపు కూడా భారీగా మరణాలు సంభవించాయి’ అని కరోనా వైరస్, అమెరికా చైనా సంబంధాలపై ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ చైర్మన్‌ ఆడమ్‌ షిఫ్‌ తెలిపారు.  కరోనా వైరస్, తాజా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాతో సంబంధాల విషయంలో భారత్‌ పునరాలోచిస్తోందని ఆకమిటీకి బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్‌ సభ్యుడు తాన్వి మదన్‌ వివరించారు. పరిస్థితులను బట్టి భారత్‌ అమెరికా నుంచి ఏం ఆశించనుందో అంచనా వేస్తుండాలన్నారు.

మరిన్ని వార్తలు