ఇమ్రాన్‌..జాగ్రత్తగా మాట్లాడండి!

21 Aug, 2019 03:36 IST|Sakshi

భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలపై పాక్‌ ప్రధానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సూచన

కశ్మీర్‌ భారత అంతర్గత అంశమన్న అగ్రరాజ్యం

వాషింగ్టన్‌: భారత్‌పై చేసే వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు సూచించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ఈ ప్రాంతంలో పరిస్థితి జఠిలంగానే ఉందని, ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు కలిసి పనిచేయాలని భారత్, పాక్‌లను ఆయన కోరారు. కశ్మీర్‌ విషయంలో తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్‌తో కలిసి పనిచేయాలని, సంయమనంతో వ్యవహరించాలని, అదే సమయంలో భారత్‌పై చేసే వ్యాఖ్యల విషయంలో నిగ్రహంతో వ్యవహరించాలని అధ్యక్షుడు ట్రంప్‌ ఇమ్రాన్‌ను కోరారని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో పేర్కొంది.

జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయంపై పాక్‌ తీవ్ర అభ్యంతరం తెలపడం, రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరు దేశాల ప్రధానులతో సోమవారం ఫోన్‌లో సంభాషించారు. అనంతరం ఆయన ట్విట్టర్‌లో ‘వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపుతో రెండు దేశాల ప్రధానులతో చర్చించా.

ముఖ్యంగా కశ్మీర్‌ విషయంలో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని భారత్, పాక్‌ ప్రధానులు నరేంద్ర మోదీ, ఇమ్రాన్‌ఖాన్‌లకు సూచించా. అక్కడ పరిస్థితి జఠిలంగానే ఉన్నప్పటికీ, మా మధ్య సంభాషణలు ఫలప్రదంగా సాగాయి’అని ట్రంప్‌ ట్విట్టర్‌లో తెలిపారు. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, ఆ ప్రాంతంలో శాంతి నెలకొనాల్సిన అవసరాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ వారికి వివరించారు. ప్రాంతీయ పరిణామాలతోపాటు అమెరికా– భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంపైనా భారత ప్రధాని మోదీతో చర్చించారని, త్వరలోనే మరోసారి సమావేశం కావాలని ఆకాంక్షించారని తెలిపింది.

ఉగ్రవాదం, హింసకు తావులేని వాతావరణం నెలకొల్పాల్సిన అవసరాన్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని పోషించడం పాక్‌ ఆపాలని ట్రంప్‌ను మోదీ కోరారని వెల్లడించింది. భారత ప్రభుత్వం జాత్యహంకార, ఫాసిస్టు ధోరణితో వ్యవహరిస్తోందని, దీని కారణంగా పాకిస్తాన్‌తోపాటు భారత్‌లోని మైనారిటీల సంక్షేమం ప్రమాదంలో పడిందని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌ వద్ద ఉన్న అణ్వాయుధాల భద్రతపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలన్నారు. సోమవారం ట్రంప్‌తో దాదాపు అరగంటపాటు జరిగిన ఫోన్‌ సంభాషణల్లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే.

అనంతరం ట్రంప్‌ పాక్‌ ప్రధానితో మాట్లాడారు. అయితే, కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రధాని ఇమ్రాన్‌ కోరారని పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మూద్‌ ఖురేషి పేర్కొన్నారు. కశ్మీర్‌లో ఆంక్షలను ఎత్తివేయాలని, మానవహక్కుల సంఘాలను కశ్మీర్‌లో పరిస్థితులపై అంచనా వేసేందుకు పంపించాలని కూడా ఇమ్రాన్‌ కోరారన్నారు. ఇలా ఉండగా, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌æ మంగళవారం అమెరికా రక్షణ మంత్రి ఎస్పెర్‌తో ఫోన్‌లో సంభాషించారు.

భారత్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఆర్టికల్‌ 370 రద్దు, సంబంధిత అంశాలు తమ అంతర్గత విషయమని కూడా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి జరుగుతున్న పరిణామాలు భారత్‌ అంతరంగిక వ్యవహారమని, భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఎస్పెర్‌ ప్రశంసించారని అధికారులు తెలిపారు. భారత్, పాక్‌కు ఈ అంశాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కూడా సూచించారన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా