మలేరియా మందు భేష్‌!

21 May, 2020 04:49 IST|Sakshi

పునరుద్ఘాటించిన ట్రంప్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ నుంచి రక్షణ కోసం మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ తీసుకోవడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమర్థించుకున్నారు. రెండు వారాలుగా తాను ఈ మందును తీసుకుంటున్నట్లు ట్రంప్‌ సోమవారం చెప్పడం తెల్సిందే. మరికొంత కాలం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తీసుకుంటానని, అది సురక్షితమైందని కరోనా వైరస్‌ ఎదుర్కొనే మేలైన మార్గమని మంగళవారం ఆయన పునరుద్ఘాటించారు. ‘అది చాలా శక్తిమంతమైన మందు. మీకు హాని కలిగించదు. కాబట్టి దాన్ని కరోనా చికిత్సకు వాడాలని అనుకున్నా’ అని విలేకరులతో చెప్పారు. (హెచ్‌1బీతో అమెరికన్లకు నష్టం లేదు!)

ప్రపంచవ్యాప్తంగా చాలామంది వైద్యులు ఈ మందును ప్రశంసించారని, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌ తదితర దేశాల్లో గొప్ప అధ్యయనాలు జరిగాయని అమెరికాలోనూ పలువురు వైద్యులు ఈ మందుపై సానుకూలంగా వ్యవహరించారని ట్రంప్‌ వివరించారు. మరణం ముంగిట్లో ఉన్నవారికి ఈ మందు ఇచ్చి అది పనిచేయలేదని కొంతమంది ఒక అధ్యయనం ద్వారా చెప్పారని వాళ్లు తమ శ్రేయోభిలాషులు కాదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. (ప్రపంచంపై కరోనా పంజా)

మలేరియా చికిత్సకు ఈ మందును నలభై ఏళ్లుగా వాడుతున్నారని కానీ వైద్యుల సలహా మేరకు వాడేందుకు ఎఫ్‌డీఏ అనుమతిచ్చిందని ఆయన వివరించారు. కాబట్టి వైద్యుల సలహా మేరకే ఎవరైనా ఆ మందును వాడాలని చెప్పారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ట్రంప్‌ శాస్త్రీయంగా నిరూపణ కాని ఓ మందును కరోనా చికిత్సకు వాడటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాటలు విని ఎవరైనా ఈ మందును వాడితే ఎలా? అని సెనేట్‌ మైనారిటీ నేత చక్‌ షుమర్‌ ప్రశ్నించారు.

చైనాతో ఒప్పందంపై భిన్నాభిప్రాయం
చైనాతో వాణిజ్యానికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో చేసుకున్న ఒప్పందంపై తనకు ఇప్పుడు భిన్నాభిప్రాయం ఉందని అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జనవరిలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం 2020 –21లో అమెరికా ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలుచేసేందుకు చైనా అంగీకరించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తిని చైనా అడ్డుకోలేకపోయిందని వూహాన్‌కు మాత్రమే వైరస్‌ను పరిమితం చేసిన చైనా ఇతర దేశాలకు చేరకుండా ఎందుకు అడ్డుకోలేకపోయిందన్నది తెలియడం లేదని అన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు