అమెరికాలో టిక్‌టాక్‌ బ్యాన్‌?

8 Jul, 2020 01:53 IST|Sakshi

వాషింగ్టన్‌: టిక్‌టాక్‌ సహా పలు ప్రముఖ చైనా సోషల్‌ మీడియా యాప్‌లను నిషేధించే దిశగా ట్రంప్‌ ప్రభుత్వం ఆలోచిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో సోమవారం ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో పేర్కొన్నారు. ఆయా యాప్‌లు సేకరిస్తున్న సమాచారంపై ట్రంప్‌ నివేదికలను తెప్పించుకొని పరిశీలిస్తున్నారని చెప్పారు. కొన్ని యాప్‌లను ఇప్పటికే భారత్‌ నిషేధించిందని, ఆస్ట్రేలియా కూడా నిషేధించాలని చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం సీరియస్‌ గా ఉందని, హువావే టెక్నాలజీతో సమస్య వచ్చినప్పుడు వెంటనే నిషేధిస్తూ చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. 

త్వరలో ట్రంప్‌ ప్రకటన 
అమెరికన్ల సెల్‌ఫోన్లలో ఉన్న చైనా యాప్‌లపై కూడా త్వరలోనే సరైన చర్యలు తీసుకుంటామని పాంపియో చెప్పారు. ట్రంప్‌ ప్రకటనకు ముందుగా ఇంతకంటే లోతైన వివరాలు చెప్పాలని అనుకోవడం లేదన్నారు. టిక్‌టాక్‌ వాడే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా అమెరికన్లకు హెచ్చరికలు ఇస్తామని, వారి సమాచారం చైనా కమ్యూనిస్టు పార్టీ చేతుల్లో పడకుండా ఉండాల్సిందిగా చెబుతామని ఆయన అన్నారు. కరోనా వైరస్‌ కారణంగా అమెరికాకు, చైనాకు మధ్య వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో పాంపియో ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాముఖ్యత ఏర్పడింది. టిక్‌టాక్‌ను ఇప్పటికే నిషేధించి ఉండాల్సిందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓ బ్రియన్‌ కూడా అన్నారు.

హాంకాంగ్‌ను వీడనున్న టిక్‌టాక్‌ 
హాంకాంగ్‌లో కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక టిక్‌టాక్‌ ప్రకటించింది. గత వారం నుంచి హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని చైనా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త చట్టం ప్రకారం సామాజిక మాధ్యమ వేదికలు, వివిధ యాప్‌లు వినియోగదారుల డేటాను హాంకాంగ్‌ ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ‘ఇటీవలి పరిణామాల దృష్ట్యా హాంకాంగ్‌లో కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించాం’ అని టిక్‌టాక్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు