మరోసారి భారత్‌పై ట్రంప్‌ ఆగ్రహం​

9 Jul, 2019 19:54 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా వస్తువులపై భారత్‌ విధిస్తున్న దిగుమతి సుంకాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సహకారం కోసం జరిగే చర్చలో భారత్‌ సరైన వివరాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్‌ చేసిన ఆయన భారత్‌ తమ వస్తువులపై విధించే సుంకాలను పునరాలోచించుకోవాలని కోరారు.

భారత్‌ అధిక పన్నులు విధిస్తుందంటూ ట్రంప్‌ పలుమార్లు ట్విటర్‌ ద్వారా విమర్శించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా భారత్‌నుంచి దిగుమతి అయ్యే అల్యూమినియం, ఉక్కు తదితర వస్తువులపై అమెరికా దిగుమతి సుంకాలను పెంచి వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ చర్యలతో  దారికొస్తుందని భావించిన అమెరికాకు భారత్‌ ఉహించని షాక్‌ ఇచ్చింది. ఏకంగా 28 రకాల అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచడంతో ఖంగుతింది. దీంతో భారత్‌ను అమెరికా ఇచ్చే ఎగుమతి ప్రోత్సాహక దేశాల జాబితానుంచి తీసివేసింది. ఒక పక్క ఇరుదేశాల మధ్య ఏర్పడిన వాణిజ్య సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని అంటూనే సుంకాలను పెంచుకుంటూ వాణిజ్యయుద్ధాన్ని కొనసాగించాయి. జీ-20 సమ్మిట్‌లో మోదీ-ట్రంప్‌ల మధ్య ఈ వివాదంపై ఒక అవగాహనకు వచ్చారనే విశ్లేషకులు భావించారు. కానీ ట్రంప్‌ తాజా ట్వీట్‌తో ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు