ఇది మంచి ఆరంభం

17 Jul, 2018 01:11 IST|Sakshi
హెల్సింకిలోని అధ్యక్ష భవనంలో కలసినపుడు ఆప్యాయంగా పలకరించుకుంటున్న ట్రంప్, పుతిన్‌. చిత్రంలో ట్రంప్‌ భార్య మెలానియా

రష్యాతో సంబంధాలపై ట్రంప్‌

ఫిన్లాండ్‌లో ముగిసిన శిఖరాగ్ర భేటీ

చర్చలు విజయవంతం: పుతిన్‌

బలమైన బంధం కోసం కృషి చేస్తామన్న ఇరు దేశాధ్యక్షులు

ఎన్నికల్లో రష్యా జోక్యం లేదని పునరుద్ఘాటన  

ఇద్దరిలోనూ నిరుత్సాహం, నిర్వేదం
ఐక్యరాజ్యసమితి సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండే కావొచ్చు. ట్రంప్, పుతిన్‌లను మాత్రం ఆ దేశం కనీసం నవ్వించలేక పోయింది. శిఖరాగ్ర భేటీ సందర్భంగా ఈ ఇరువురి మొహాల్లో సంతోషమే కనిపించలేదు. తొలుత భేటీ కోసం ఎదురెదురుగా వచ్చినప్పుడు వారు ఒకరికొకరు చేతులు కూడా కలుపుకోలేదు. ఏ కోలాహలం లేకుండా నిశ్శబ్ధంగానే చర్చల గదిలోకి వెళ్లారు. తర్వాత తమ తమ కుర్చీల్లో కూర్చున్నాకనే ముభావంగానే షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకున్నారు. అమెరికా అధికారులు కూడా అంతా గంభీరంగానే కనిపించారు. శ్వేతసౌధం అధికార ప్రతినిధి సారా శాండర్స్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటోలో కూడా.. పుతిన్‌ తల దించుకుని నీరసంగా కూర్చోగా ట్రంప్‌ కూడా నిరుత్సాహంగా, కోపంగా కనిపించారు.

అయితే ఆ తర్వాత వచ్చిన ఓ వీడియో ఫుటేజ్‌లో మాత్రం పుతిన్‌కు ట్రంప్‌ కన్ను కొడుతున్నట్లుగా కనిపించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను ట్రంప్‌ సింగపూర్‌లో కలిసినప్పుడు ఉన్న సందడి ఫిన్లాండ్‌లో ఏ మాత్రం కనిపించలేదు. కాగా, సాధారణంగా అమెరికా, రష్యా నేతలు ఎప్పుడు కలిసినా ఫిన్లాండ్‌నే అందుకు వేదికగా ఎంచుకుంటూ ఉంటారు. చివరిగా 1997లో అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్, రష్యా అధ్యక్షుడు బోరిస్‌ ఎల్ట్సిన్‌లు హెల్సింకిలోనే భేటీ అయ్యారు. ఈ భేటీపై వార్తలనందించేందుకు వివిధ దేశాల నుంచి 2 వేల మంది విలేకరులు కూడా హెల్సింకికి వచ్చారు.
 
హెల్సింకి: 18 నెలల క్రితం దేశాధ్యక్షుడయిన వారొకరు, 18 సంవత్సరాలుగా దేశాన్ని నడుపుతున్న వారొకరు. ఆ ఇద్దరు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రెండు దేశాలకు అధిపతులు. అనేక అంశాల్లో పోటీ కారణంగా ఈ రెండు దేశాల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా ఘర్షణాత్మక వాతావరణమే నెలకొంది. అయితే ఇప్పడు కొత్తగా మైత్రి కోసం ఇరు దేశాధినేతలూ ప్రయత్నించారు. ఆ ఇద్దరే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. వివిధ అంశాలపై చర్చల కోసం వీరిద్దరూ తొలిసారిగా ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకిలో సోమవారం భేటీ అయ్యారు. అమెరికా, రష్యాల మధ్య సంబంధాల ప్రభావం ప్రపంచంలోని మిగతా దేశాలపై కూడా ఉంటుంది కాబట్టి వీరి భేటీకి అంత ర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. భేటీ అనంతరం ఇద్దరు నేతలూ సానుకూలంగా స్పందించారు.

పూర్తిగా దెబ్బతిన్న సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అమెరికా, రష్యాల అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్, వ్లాదిమిర్‌ పుతిన్‌ల శిఖరాగ్ర భేటీ సోమవారం ఫిన్లాండ్‌లోని హెల్సింకిలో జరిగింది. సమావేశం అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ ‘ఇదొక మంచి ఆరంభమని నేననుకుంటున్నా. అందరికీ చాలా చాలా మంచి ఆరంభం’ అని అన్నారు. అటు పుతిన్‌ కూడా ట్రంప్‌తో తన చర్చలు ‘చాలా విజయవంతంగా, ఉపయోగకరంగా’ సాగాయని తెలిపారు.

ఫిన్లాండ్‌ అధ్యక్ష భవనంలోని ఓ గదిలో ఇద్దరు నేతలు రహస్యంగా భేటీ అయ్యి రెండు గంటలకు పైగా మాట్లాడుకున్నారు. ఆ సమయంలో గదిలో అనువాదకులు తప్ప మరెవరూ లేరు. ట్రంప్, పుతిన్‌లు ఒకరితో ఒకరు ఏకాంతంగా మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. పుతిన్‌తో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న ట్రంప్‌.. భేటీ కోసం గదిలోకి వెళ్లడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ‘రష్యాతో అమెరికా సంబంధాలు ప్రస్తుత అధమ స్థాయికి పడిపోవడానికి గత అమెరికా ప్రభుత్వాలే కారణం’ అని నిందించారు. చర్చల ప్రారంభానికి లోనికి వెళ్లే ముం దు ఇద్దరూ ముభావంగానే మీడియాతో మాట్లాడారు. ఇద్దరి ముఖాల్లోనూ పెద్ద ఉత్సాహం కనిపించలేదు.

బంధాల బలోపేతానికి కృషి
అమెరికా, రష్యా మధ్య సంబంధాలను బలోపేతం చేయడం కోసం తాము కృషి చేస్తామని ట్రంప్, పుతిన్‌లు భేటీ అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను అధిగమించడం కోసం సహకారంతో పనిచేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. సిరియా, ఉక్రెయిన్, చైనా, అంతర్జాతీయ వ్యాపారంలో సుంకాలు, అణ్వాయుధ సంపత్తి తదితరాలపై తాము చర్చించామన్నారు. ‘మా బంధాలు ఇప్పుడున్నంత బలహీనంగా గతంలో ఎప్పుడూ లేవు. అయితే నాలుగు గంటల క్రితం పరిస్థితి మారిందని నేను నమ్ముతున్నా. ఇదొక మలుపు’ అని ట్రంప్‌ అన్నారు.

రష్యాతో సత్సంబంధాలు నెలకొల్పడంలో ఇది ఆరంభం మాత్రమేనన్నారు. పుతిన్‌ మాట్లాడుతూ ‘మా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా లేవన్నది అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత ఉద్రిక్త వాతావరణానికి పెద్ద కారణాలేవీ లేవు’ అని అన్నారు. రష్యా నుంచి గ్యాస్, ముడి చమురును జర్మనీకి తరలించేందుకు నార్డ్‌ స్ట్రీమ్‌2 పైప్‌లైన్‌ను నిర్మించినప్పటికీ ఉక్రెయిన్‌ మీదుగా తమ గ్యాస్‌ సరఫరా కొనసాగుతుందని ట్రంప్‌కు తాను హామీనిచ్చినట్లు చెప్పారు. నార్డ్‌ స్ట్రీమ్‌2 వల్ల అమెరికా, ఉక్రెయిన్‌ సంబంధాలు దెబ్బతింటాయా? అన్న ప్రశ్నకు ఆయన ఈ బదులిచ్చారు.

జోక్యంపై చాలా సేపు మాట్లాడాం: ట్రంప్‌
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం గురించి కూడా తాము చాలా సమయమే మాట్లాడామని ట్రంప్‌ చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి ఇతర వివరాలను వెల్లడించని ఆయన.. రష్యా జోక్యం లేదంటూ బహిరంగంగా చెప్పనూలేదు. అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారంటూ ఇటీవల అమెరికా 12 మంది రష్యా నిఘా అధికారులపై అభియోగం మోపడాన్ని విలేకరులు ప్రస్తావించగా, రష్యా జోక్యం ఎంత మాత్రం లేనట్లు పుతిన్‌ తనకు చెప్పారనీ, ఈ అంశంలో రాబర్ట్‌ ముల్లర్‌ చేసిన విచారణ విఫలమైందని ట్రంప్‌ పేర్కొన్నారు. తన ప్రచార బృందానికి రష్యాతో ఏ సంబంధాలూ లేవని ట్రంప్‌ పునరుద్ఘాటించారు.

అటు పుతిన్‌ కూడా ‘అమెరికా అంతర్గత వ్యవహారాల్లో రష్యా ఎప్పడూ తలదూర్చలేదు. భవిష్యత్తులో ఆ పని చేసే ప్రణాళికలూ లేవు’ అని తెలిపారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను, ముడి చమురు ధరలను నియంత్రించడం కోసం అమెరికాతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని పుతిన్‌ ప్రకటించారు. ట్రంప్‌కు సంబంధించిన రహస్య సమాచారమేదో రష్యా వద్ద ఉందన్న వాదనలను పుతిన్‌ కొట్టిపారేశారు. ట్రంప్‌ తన వ్యాపార అవసరాల కోసం మాస్కోకు వచ్చినప్పుడు ఆ విషయం కూడా తనకు తెలిసేది కాదన్నారు.

ఇద్దరిలోనూ నిరుత్సాహం, నిర్వేదం
ఐక్యరాజ్యసమితి సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండే కావొచ్చు. ట్రంప్, పుతిన్‌లను మాత్రం ఆ దేశం కనీసం నవ్వించలేక పోయింది. శిఖరాగ్ర భేటీ సందర్భంగా ఈ ఇరువురి మొహాల్లో సంతోషమే కనిపించలేదు. తొలుత భేటీ కోసం ఎదురెదురుగా వచ్చినప్పుడు వారు ఒకరికొకరు చేతులు కూడా కలుపుకోలేదు. ఏ కోలాహలం లేకుండా నిశ్శబ్ధంగానే చర్చల గదిలోకి వెళ్లారు. తర్వాత తమ తమ కుర్చీల్లో కూర్చున్నాకనే ముభావంగానే షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకున్నారు. అమెరికా అధికారులు కూడా అంతా గంభీరంగానే కనిపించారు. శ్వేతసౌధం అధికార ప్రతినిధి సారా శాండర్స్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటోలో కూడా.. పుతిన్‌ తల దించుకుని నీరసంగా కూర్చోగా ట్రంప్‌ కూడా నిరుత్సాహంగా, కోపంగా కనిపించారు.

అయితే ఆ తర్వాత వచ్చిన ఓ వీడియో ఫుటేజ్‌లో మాత్రం పుతిన్‌కు ట్రంప్‌ కన్ను కొడుతున్నట్లుగా కనిపించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను ట్రంప్‌ సింగపూర్‌లో కలిసినప్పుడు ఉన్న సందడి ఫిన్లాండ్‌లో ఏ మాత్రం కనిపించలేదు. కాగా, సాధారణంగా అమెరికా, రష్యా నేతలు ఎప్పుడు కలిసినా ఫిన్లాండ్‌నే అందుకు వేదికగా ఎంచుకుంటూ ఉంటారు. చివరిగా 1997లో అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్, రష్యా అధ్యక్షుడు బోరిస్‌ ఎల్ట్సిన్‌లు హెల్సింకిలోనే భేటీ అయ్యారు. ఈ భేటీపై వార్తలనందించేందుకు వివిధ దేశాల నుంచి 2 వేల మంది విలేకరులు కూడా హెల్సింకికి వచ్చారు.  

ఆధిపత్యం.. నిస్సహాయత
లండన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల భేటీ సందర్భంగా వారి శరీర కదలికలు, హావభావాలపై ఓ బ్రిటన్‌కు చెందిన సైకాలజిస్ట్‌ పీటర్‌ కొల్లెట్‌ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. హెల్సింకీలో జరిగిన ఈ సమావేశంలో ఇద్దరు నేతలు కొద్దిసేపు ఆధిపత్య ధోరణితో ప్రవర్తించారనీ, మరికాసేటికే నిస్సహాయంగా కన్పించారని వెల్లడించారు. ‘ఇద్దరు నేతలు ఒకరి సమక్షంగా మరొకరు అంత రిలాక్స్‌గా కన్పించలేదు. చర్చల గదిలోకి ట్రంప్‌ దర్జాగా ప్రవేశిస్తే, పుతిన్‌ మాత్రం గొప్ప ఆత్మవిశ్వాసంతో లోపలకు వచ్చారు. ఈ సమావేశం లో కుడివైపు కూర్చున్న ట్రంప్‌.. పుతిన్‌కు తలొగ్గుతున్నట్లు అరచేతిని సాధారణం కంటే కొంచెం పైకెత్తి ఆయనతో కరచాలనం చేశారు.

తద్వారా చర్చల్లో మరింత చొరవ తీసుకోవాలని పుతిన్‌ను పరోక్షంగా కోరినట్లయింది. అంతలోనే పుతిన్‌ను కూర్చోవాల్సిందిగా కుర్చీ చూపించడం ద్వారా మొత్తం పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునేందుకు ట్రంప్‌ యత్నించారు’ అని కొల్లెట్‌ తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్‌ చేతుల్ని గోపురం ఆకారంలో ఉంచడంపై స్పందిస్తూ..  ‘చుట్టూ ఉన్నవారి కంటే తాను గొప్పవాడినని భావించే లేదా ఆత్మన్యూనతాభావంతో ఉండే వ్యక్తులే ఇలా చేతుల్ని పెడతారు. పుతిన్‌తో కరచాలనం సమయంలో ట్రంప్‌ ఇబ్బందిగా కన్పించారు. సమావేశంలో అధిక్యం ప్రదర్శించేందుకు అవకాశం రాకపోవడమే ఇందుకు కారణం కావొచ్చు. భేటీ సందర్భంగా ట్రంప్‌ మాటలు, హావభావాలకు పుతిన్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చారు’ అని అన్నారు.

>
మరిన్ని వార్తలు