ఉద్యోగాలు తరలించారో.. ఖబడ్దార్!

2 Dec, 2016 13:50 IST|Sakshi
ఉద్యోగాలు తరలించారో.. ఖబడ్దార్!
అమెరికాలో కంపెనీలు పెట్టి.. ఔట్‌సోర్సింగ్ పేరుతో ఉద్యోగాలను వేరే దేశాలకు ఇస్తే, అలాంటి కంపెనీలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఒక ఏసీ తయారీ కంపెనీ మెక్సికోకు తరలి వెళ్లిపోవడం కంటే దాని వెయ్యి ఉద్యోగాలను ఇక్కడే ఉంచేలా చేయడంలో తాను విజయవంతం అయినట్లు చెప్పారు. బయటకు వెళ్లిపోయే కంపెనీలు కఠిన చర్యలు ఎదుర్కోవడం ఖాయమని ఆయన అన్నారు. జనవరి 20వ తేదీన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్.. ఏరకమైన చర్యలు తీసుకునేదీ మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఎన్నికల ప్రచార సమయంలో మాత్రం, ఉద్యోగాలను బయటి దేశాలకు ఇచ్చే కంపెనీల మీద అదనంగా 35 శాతం పన్ను విధిస్తానని అన్నారు.  
 
అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదం ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రంగా పనిచేసింది. క్యారియర్ ఏసీ కంపెనీ నిజానికి తమ ఉత్పత్తి యూనిట్‌ను మెక్సికోకు తరలించాలని భావించినా, తర్వాత ట్రంప్ వైపు నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా అమెరికాలోనే ఉంచేస్తామని తెలిపింది. దాంతో వెయ్యి ఉద్యోగాలు మెక్సికోకు తరలిపోకుండా ఆగాయి. అమెరికాలోని వ్యాపారవేత్తలు డబ్బు ఆదా చేసుకోడానికి ఉద్యోగాలను బయటి దేశాలకు పంపడానికి ప్రయత్నిస్తే తాను ఎలా వ్యవహరిస్తానన్న విషయాన్ని క్యారియర్ ఏసీ కంపెనీతో చర్చలే చూపిస్తాయని ట్రంప్ అంటున్నారు. స్వదేశంలో వ్యాపారాలు చేసుకునేవారికి తక్కువ పన్నులు, నిబంధనల సడలింపుతో ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టిస్తామన్నారు.
>
మరిన్ని వార్తలు