నోరు అదుపులో పెట్టుకోండి: ట్రంప్‌ హెచ్చరిక

18 Jan, 2020 11:48 IST|Sakshi

వాషింగ్టన్‌/టెహ్రాన్‌: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అని చెప్పుకొంటున్న వ్యక్తి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. అమెరికా, ఐరోపా దేశాల గురించి ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ’ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకీ దిగజారిపోతోంది. అక్కడి ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాబట్టి ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆచితూచి మాట్లాడాలి. అయినా ఆయన ఎంతో కాలం సుప్రీంగా ఉండబోరు’ అని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీపై విమర్శలు గుప్పించారు. కాగా పరస్పర ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇరాన్‌- అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆనాటి నుంచి ఇరు దేశాల నాయకులు మాటల యుద్ధానికి దిగుతున్నారు.(అమెరికా లక్ష్యంగా.. ఇరాక్ స్థావరాలపై దాడులు)

ఈ క్రమంలో ఖమేనీ తాజాగా మరోసారి ట్రంప్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. అమెరికాలో ట్రంప్‌ పాలన జోకర్‌ మాదిరిగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదే విధంగా ఇరాన్‌లో ఉక్రెయిన్‌ విమాన ప్రమాదం విషాదకర ఘటన అని.. అయితే ప్రత్యర్థి దేశాలు మాత్రం ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాయని ఖమేనీ వ్యాఖ్యానించారు. అణు ఒప్పందం తదితర విషయాల్లో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ రోజుకో మాట మారుస్తూ... అమెరికా బానిసలు అని నిరూపించుకుంటున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.(క్షమించరాని తప్పు చేశాం: ఇరాన్‌)

ఈ నేపథ్యంలో ఖమేనీ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్‌...‘ అమెరికాను ప్రేమించే ఇరాన్‌ అత్యున్నత ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పరువు కోసమని వారిని చంపడం సరికాదు. ఇరాన్‌ను నాశనం చేయడం కంటే.. ఉగ్రవాదాన్ని రూపుమాపడంపై ఎక్కువ దృష్టి సారించి.. ఇరాన్‌ను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దాలి’ అని ట్వీట్‌ చేశారు. అదే విధంగా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అవాకులు, చెవాకులు పేలడం మానుకోవాలని హెచ్చరించారు. (ఉద్రిక్తతలు తగ్గాలనే కోరుకుంటున్నాం)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా