డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలగుతాం

20 May, 2020 00:55 IST|Sakshi

స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు రుజువు చేయండి

నెల రోజుల గడువు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)పై తన విమర్శల అస్త్రాలను ఎక్కుపెట్టారు. కరోనా వైరస్‌ విషయంలో చైనా ఒత్తిడికి తలొగ్గారని, పక్షపాతంతో వ్యవహరించారని ట్రంప్‌ పలుమార్లు వ్యాఖ్యానించడం తెల్సిందే. నెలలోపు తాను స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ చూపలేకపోతే అమెరికా ఇచ్చే వార్షిక నిధులను శాశ్వతంగా ఆపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధోనంకు ట్రంప్‌ ఒక లేఖ రాస్తూ ‘మీరు.. మీ సంస్థ పదేపదే చేసిన తప్పులకు ప్రపంచం పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చైనా ప్రభావానికి లొంగకుండా స్వతంత్రంగా పనిచేస్తున్నారని చూపగలిగితేనే డబ్ల్యూహెచ్‌ఓతో ముందుకెళ్లగలం’అని స్పష్టం చేశారు. సంస్థాగత మార్పుల గురించి అమెరికా ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓతో చర్చలు మొదలుపెట్టిందని, సమయం వృథా చేయకుండా దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ట్రంప్‌ ట్వీట్‌చేశారు.  షరతులను పాటించకపోతే వార్షిక నిధులపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని శాశ్వతం చేస్తామని, సంస్థలో సభ్యత్వం విషయాన్ని పునః పరిశీలిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు.

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడుతున్నా..
కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు తాను శాస్త్రీయంగా నిరూపితం కాని మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వాడుతున్నట్లు ట్రంప్‌ చెప్పారు. రెండు వారాల క్రితం నుంచి తాను ఈ మాత్రను తీసుకుంటున్నట్లు తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ తీసుకోవాల్సిందిగా వైట్‌హౌస్‌ వైద్యులెవరూ తనకు నిర్దుష్టంగా చెప్పలేదని, కాకపోతే... వాళ్లను అడిగినప్పుడు ఇష్టమైతే వాడమని సూచించారని, దాంతో తాను తీసుకోవడం మొదలుపెట్టానని వివరించారు. ఈ మాత్రను ఎప్పుడో ఒకప్పుడు నిలిపివేస్తానని చెప్పారు.

అధిక కరోనా కేసులున్న దేశాలు

మరిన్ని వార్తలు