అమెరికన్లు ఆయన కోసం ప్రార్థిస్తున్నారు: ట్రంప్‌

6 Apr, 2020 11:53 IST|Sakshi
మాట్లాడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌ :  కరోనా వైరస్‌తో బాధపడుతున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆకాంక్షించారు. ఆదివారం కరోనా వైరస్‌పై జరిపిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ కరోనా వైరస్‌తో పోరాడుతున్న బోరిస్‌కు మా దేశం తరపున మంచి జరగాలని కోరుకుంటున్నాం. అమెరికన్లు ఆయన కోసం ప్రార్థిస్తున్నారు. బోరిస్‌ నాకు మంచి మిత్రుడు, గొప్ప వ్యక్తి. మనందరికీ తెలుసు! ఈ రోజు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడు కచ్చితంగా కోలుకుంటాడని భావిస్తున్నాన’ని అన్నారు. ( పెరుగుతున్న కేసులు.. ఎమర్జెన్సీకి అవకాశం )

కాగా, గత కొద్దిరోజులుగా  క్వారంటైన్‌లో ఉంటూ కరోనాకు చికిత్స చేయించుకుంటున్న బోరిస్‌ ఆదివారం ఆసుపత్రిలో చేరారు. కొన్ని వైరస్‌ లక్షణాలు తగ్గకపోవటం వల్లే ఆయన్ని ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బోరిస్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని స్పష్టం చేశారు. బ్రిటన్‌లో ఇప్పటివరకు 47,806 మంది కరోనా వైరస్ బారిన పడగా.. 4,934 మంది మరణించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 13 లక్షల మందికి కరోనా సోకగా.. 69,459 మంది మృత్యువాతపడ్డారు. ( కరోనా కట్టడికి వినూత్న ప్రయత్నం )

>
మరిన్ని వార్తలు