-

కిమ్‌ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా: ట్రంప్‌

22 Apr, 2020 09:23 IST|Sakshi

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు.‌ ఒకవేళ కిమ్‌ అనారోగ్యానికి గురైతే త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు మంగళవారం వైట్‌హౌజ్‌‌ వద్ద విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉత్తర కొరియాతో తమకు మంచి సంబంధాలు ఉన్నట్లు ట్రంప్‌ వెల్లడించారు. ‘కిమ్‌ ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే నేను చెప్పగలను. ఆయన ఆరోగ్యంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. కిమ్‌ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే నివేదికలు తెలిపిన దాని ప్రకారం కిమ్‌ ఆరోగ్యం విషమంగా ఉంటే అది తీవ్రమైన పరిస్థితి’గా ట్రంప్‌ వర్ణించారు. కానీ కిమ్‌ ఆరోగ్యం గురించి ట్రంప్‌కు సరైన సమాచారం ఉందా అన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. (విషమం‍గా కిమ్‌ జోంగ్ ఆరోగ్యం..!)

కాగా గత కొంత కాలంగా కిమ్‌ జోంగ్‌ అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఆయన శస్త్ర చికిత్స చేసుకున్నారని, ప్రస్తుతం  ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు మంగళవారం మీడియా కథనాలు వెలువడ్డాయి. కాగా ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్‌ హాజరుకాక పోవడంతో ఆయనకు ఏమైందన్న విషయం చర్చరనీయంశంగా మారింది. నిత్యం తన పనులతో వార్తల్లో నిలిచే కిమ్ జంగ్ ఉన్ కనిపించక పోవడంతో ఆయన అనారోగ్యమే ఇందుకు కారణమంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి. (కిమ్‌ ఆరోగ్యం విషమం.. ఆ వార్తలు నిజం కాదు)

మరిన్ని వార్తలు