అమెరికాలో ట్రావెల్‌ బ్యాన్‌పై మళ్లీ స్టే

19 Oct, 2017 01:50 IST|Sakshi

వాషింగ్టన్‌: ఆరు ముస్లిం దేశాల ప్రజలతోపాటు ఉత్తర కొరియా పౌరులు, వెనుజులా అధికారులు అమెరికాకు రావడంపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్తగా తీసుకొచ్చిన ఉత్తర్వులను రెండు అమెరికా కోర్టులు నిలుపుదల చేశాయి. ట్రంప్‌ ఉత్తర్వులు మరికొన్ని గంటల్లో అమల్లోకి రావాల్సి ఉండగా, ఆ ఆదేశాలపై స్టే విధిస్తూ హవాయ్‌ ఫెడరల్‌ కోర్టు, మేరీలాండ్‌ ఫెడరల్‌ కోర్టులు తీర్పునిచ్చాయి. గత నిషేధ ఉత్తర్వుల మాదిరే తాజా బ్యాన్‌ కూడా అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందనీ, ముస్లిం మతస్తులను లక్ష్యంగా చేసుకుంటోందని మేరీలాండ్‌ కోర్టు జడ్జి థియోడర్‌ చువాంగ్‌ పేర్కొన్నారు.

ట్రంప్‌ తన తాజా ఉత్తర్వుల్లో ముస్లిం ఆధిక్య దేశాలైన ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమన్‌తోపాటు ఉత్తరకొరియా పౌరులు, వెనిజులాకు చెందిన కొందరు అధికారులు అమెరికాలోకి రావడంపై ఆంక్షలు విధించారు. నిర్దిష్ట దేశాల నుంచి వలసలను నిరోధించడం అమెరికా ప్రయోజనాలకు భంగకరమని, జాతీయత ఆధారంగా వివక్ష చూపేలా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని హవాయ్‌ ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా, ఈ తీర్పులపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు వైట్‌హౌస్‌ సంకేతాలు పంపింది.  

మరిన్ని వార్తలు