ట్రంప్‌ అల్లుడి తెర వెనుక కథ!

29 May, 2017 19:21 IST|Sakshi
ట్రంప్‌ అల్లుడి తెర వెనుక కథ!

వేడెక్కిన అమెరికా రాజకీయాలు!

రష్యా ప్రభుత్వంతో రహస్య సమాచార సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్న తన ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ అల్లుడు, వైట్‌హౌస్‌ సీనియర్‌ సలహాదారు జారెడ్‌ కుష్‌నర్‌ డిసెంబర్‌లో అమెరికాలో రష్యా రాయబారితో మాట్లాడడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తోంది. అప్పటికి ట్రంప్‌ అధ్యక్ష పదవి కూడా స్వీకరించలేదు. అంటే ఆయన అల్లుడు సాధారణ పౌరుడు. ఎలాంటి అధికార పదవి లేకుండా ట్రంప్‌ బృందం తరఫున రష్యా రాయబారి సెర్గీ కిసిలియాక్‌తో మాట్లాడటంపై రెండు అమెరికా ప్రధాన దినపత్రికలు వాషింగ్టన్‌ పోస్ట్‌, న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన కథనాలు ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతున్న దర్యాప్తునకు మరింత పదును పెంచాయి. అయితే, తన అల్లుడిపై రాసిన వార్తలపై ట్రంప్‌ మండిపడటమే కాక, కుష్‌నర్‌ చాలా మంచోడని ప్రశంసించారు. తమతో మంచి సంబంధాలు లేని దేశంతో రహస్య సమాచార సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన మంచిదేనని అమెరికా హోంశాఖ మంత్రి జాన్‌ కెలీ వ్యాఖ్యానించారు.

రహస్య సంబంధాలు ఎందుకు?
దౌత్యపరమైన సౌకర్యం ద్వారా రష్యాకు లభించే సమాచార సంబంధాలను ట్రంప్‌ వాడుకుంటే రష్యన్లతో ఆయనేం మాట్లాడిందీ అమెరికా గూఢచార సంస్థలు తెలుసుకోలేవు. వైట్‌హౌస్‌లోని ముగ్గురు కీలకవ్యక్తులు అందించిన సమాచారంతో ఈ విషయం లీకైంది. కిందటి డిసెంబర్‌లో న్యూయార్క్‌లోని ట్రంప్‌ టవర్‌లో రష్యా రాయబారితో జరిగిన సమావేశంలో కుష్‌నర్‌తో పాటు వివాదాస్పద మాజీ జనరల్‌ మైకేల్‌ ఫ్లిన్‌ కూడా ఉన్నారు. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక కొద్దికాలం ఫ్లిన్‌ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రహస్య కమ్యూనికేషన్‌ సౌకర్యం ఏర్పాటుకు ఎవరు ప్రతిపాదించారో తెలియదు. ట్రంప్‌ బృందం ఈ విషయాన్ని అప్పట్లో వెల్లడించలేదు. 5 నెలల తర్వాత ట్రంప్‌ బృందం-పుతిన్‌ సంబంధాలపై ఎఫ్‌బీఐ, కాంగ్రెస్‌ కమిటీల దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఈ విషయం మీడియాలో రావడంతో రష్యాతో కుష్‌నర్‌ సంబంధాలపై మరోసారి వివాదం చెలరేగింది.

రష్యా బ్యాంకు ఉన్నతాధికారితో సమావేశం ఎందుకు?
రాయబారితో సమావేశం తర్వాత అప్పటికే అమెరికా ఆంక్షలతో సతమౌతమవుతున్న బడా రష్యా బ్యాంక్‌ వ్నెషేకానం బ్యాంక్ ‌(వీఈబీ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సెర్గీ గోర్కోవ్‌తో కుష్‌నర్‌ భేటీ కావడానికి ట్రంప్‌ టవర్‌ మీటింగ్‌కూ సంబంధం ఉండొచ్చని రెండు పత్రికలూ సూచనప్రాయంగా తెలిపాయి. ఈ బ్యాంక్‌ సహా ఇతర రష్యా ఆర్థిక సంస్థలపై విధించిన ఆంక్షలు తొలగిస్తే, అందుకు బదులుగా కొన్ని ఇబ్బందుల్లో చిక్కుకున్న కుష్‌నర్‌ న్యూయార్క్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ (666 ఫిఫ్త్‌ ఎవెన్యూ)కు వాటి నుంచి పెట్టుబడులు సంపాదించే విషయమై ఈ భేటీలో చర్చించి ఉండొచ్చని కూడా తెలుస్తోంది. ఈ కథనాల తర్వాత తన అల్లుడు సమర్ధుడు, మంచివాడని ట్విటర్‌లో ట్రంప్‌ ప్రశంసించినా, మరోపక్క కొంతకాలం ‘తగ్గి ఉండాలని’ ఆయనకు సూచించారని వార్తలొచ్చాయి.

కుష్‌నర్‌ చేసింది కరెక్టే: వికీలీక్స్ అసాంజ్‌
రష్యాతో రహస్య సమాచార సంబంధాలు ఏర్పాటుకు కుష్‌నర్‌ చేసిన ప్రయత్నంలో తప్పేమీ లేదని వికీలీక్స్‌ స్థాపకుడు జూలియన్‌ అసాంజ్‌ సమర్ధించారు. కిందటేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నప్పుడు డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ ఈ మెయిల్స్‌ను వికీలీక్స్‌ బయట పెట్టిన విషయం తెలిసిందే. రష్యా గూఢచార సంస్థల సహకారంతోనే అసాంజ్‌ ఈ పనిచేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. హిల్లరీ ఈ మెయిల్స్‌ వ్యవహారాన్ని ట్రంప్‌ తనకు అనుకూలంగా మార్చుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు