భారతీయుడి మృతితో సింగపూర్‌లో చెలరేగిన హింస

10 Dec, 2013 00:43 IST|Sakshi

 సింగపూర్: సింగపూర్‌లో అల్లర్లకు కారణమైన 24 మంది భారతీయులతో సహా మొత్తం 27మందిని సోమవారం ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆదివారం రాత్రి హాంషేర్ పరిధిలోని జంక్షన్ ఆఫ్ రేస్‌కోర్స్‌లో ప్రైవేటు బస్సు ఢీకొట్టడడంతో భారత్‌కు చెందిన  భవన నిర్మాణ కార్మికుడు ఒకరు మృతిచెందారు. దీంతో ఆగ్రహించిన స్థానిక భారతీయులు ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై దాడి చేయడంతో ఒక్కసారిగా హింస చెలరేగింది. 10 మంది పోలీసులతోసహా 18 మందికి ఈ ఘటనలో గాయాలయ్యాయి. 16 వాహనాలు  ధ్వంసమయ్యాయి. అల్లర్లలో 400 మంది వరకు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.
 
  ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ దర్యాప్తునకు ఆదేశించారు. అల్లర్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. దేశప్రజలు సంయమనం పాటించాలని కోరారు. కాగా, ఆదివారం రాత్రి రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని తమిళనాడువాసి కురవేలు(33)గా గుర్తించారు. సింగపూర్‌లో రెండేళ్లుగా ఆయన భవననిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు