అఫ్గాన్‌లో రెచ్చిపోయిన తాలిబన్లు

16 Nov, 2018 03:32 IST|Sakshi

పోలీసు ఔట్‌పోస్టుపై దాడి..

30 మంది భద్రతా సిబ్బంది మృతి

కాబుల్‌: అఫ్గాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం రాత్రి తాలిబన్లు పశ్చిమ ప్రావిన్స్‌లోని ఫరాలోని పోలీసు ఔట్‌ పోస్ట్‌పై మెరుపుదాడి చేయడంతో 30 మంది భద్రతాసిబ్బంది మరణించారు. అనంతరం భద్రతాదళాలు జరిపిన వైమానిక దాడుల్లో 17 మంది తాలిబన్లు చనిపోయారు. ఉగ్రవాదులకు భద్రతా సిబ్బందికీ మధ్య సుమారు నాలుగు గంటలకు పైగా హోరాహోరీగా కాల్పులు జరిగినట్లు ప్రావిన్షియల్‌ కౌన్సిల్‌ సభ్యుడు దాదుల్లా ఖనీ మీడియాకు తెలిపారు. తాలిబన్లు దాడిచేసిన ఔట్‌పోస్టులో జాతీయ, స్థానిక విభాగాలకు చెందిన పోలీసు దళాలు ఉన్నాయన్నారు.

పోలీసు కాల్పులను ఎదుర్కొంటూనే ఔట్‌పోస్టు నుంచి తాలిబన్లు భారీ ఎత్తున ఆయుధ సామగ్రిని ఎత్తుకెళ్లారు. తాలిబన్లకు, భద్రతా సిబ్బందికి మధ్య నిత్యం జరుగుతున్న హింసాత్మక దాడుల్లో రోజుకు సగటున కనీసం 45 మంది అఫ్గాన్‌ పోలీసులు మరణించడం లేదా తీవ్రంగా గాయపడటం జరుగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. తాలిబన్లకు, భద్రతాసిబ్బందికీ మధ్య జరుగుతున్న హింసాత్మక దాడుల కారణంగా గత రెండువారాలుగా సెంట్రల్‌ గజనీ ప్రావిన్స్‌లోని రెండు జిల్లాల్లో చాలామంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

మరిన్ని వార్తలు