డబ్ల్యూహెచ్‌ఓ రాయబారి సంచలన వ్యాఖ్యలు

3 Jul, 2020 08:37 IST|Sakshi
డాక్టర్‌ డేవిడ్‌ నబారో

కరోనాను పూర్తిగా నయం చేసే వ్యాక్సిన్‌ లేదు

కొన్ని మిలియన్ల మంది కరోనా బారిన పడతారు

లాక్‌డౌన్‌ సరైందే కానీ.. ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టాలి

సెకండ్‌ వేవ్‌ అవకాశం ఉంది

జెనీవా: కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించే వ్యాక్సిన్‌ రావాడానికి.. పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేయడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ రాయబారి డాక్టర్‌ డేవిడ్‌ నబారో తెలిపారు. ఓ భారతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. అయితే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు కరోనాకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని చెప్పడమే కాక మానవులు మీద ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నబారో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతానికైతే కరోనాను పూర్తిగా తగ్గించే చికిత్స ఏది లేదన్నారు. ఎవరైనా అలాంటి వాదనలు చేస్తే.. పూర్తి సాక్ష్యాలు చూపించమని కోరాలి అన్నారు. అంతేకాక ‘ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఒకసారి కరోనా బారిన పడిన వ్యక్తికి.. మరలా అది తిరిగి రాకుండా అతని రోగ నిరోధక శక్తి అడ్డుకోగలదో లేదో మనకు ఇంకా తెలియదు అన్నారు. వ్యాక్సిన్ వచ్చినప్పటికి కూడా టీకాలు తీసుకున్న వ్యక్తి వైరస్ నుండి పూర్తిగా రక్షించబడ్డాడా లేదా అనే విషయం మాకు తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. దానితో పాటు నిరూపించాల్సిన అంశాలు ఇంకా చాలానే ఉంటాయి’ అన్నారు నబారో. 

అంతేకాక ఈ ప్రతిపాదిత వ్యాక్సిన్‌ను ఓ వ్యక్తికి ఇచ్చినప్పుడు అది ప్రతికూల చర్యలను ప్రేరేపించకూడదని నబారో తెలిపారు. అయితే ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ స్టేజ్‌లో ఉన్న వ్యాక్సిన్‌లను ఉద్దేశిస్తూ.. 2021 నాటికి ఇవి సక్సెస్‌ అయినా పెద్దగా ప్రయోజనం ఉండదని తెలిపారు. ‘ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ ఇవ్వాలి. ఎక్కువ కేసులు ఉన్న దేశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. పేద, ధనిక దేశాలు అనే బేధం లేకుండా అందరికి వ్యాక్సిన్‌ అందాలి. అలాంటప్పుడు ప్రపంచ జనాభా మొత్తానికి సరిపడా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయాలంటే ఎంత లేదన్నా కనీసం రెండున్నర ఏళ్లు పడుతుంది. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న అత్యుత్తమ మార్గం మన జీవన శైలిని మార్చుకోవడం. అంతకు మించి మార్గం లేదు. ఒక వేళ వ్యాక్సిన్‌ నేను చెప్పిన సమయం కంటే ముందుగానే వస్తే నా కంటే ఎక్కువ సంతోషపడేవారు ఎవరు లేరు’ అన్నారు నబారో. (బతుకు.. బొమ్మలాట)

వైరస్‌తో సహజీవనం
నబారో మాట్లాడుతూ... ‘కొద్ది రోజులుగా పత్రికలు, ప్రభుత్వాలు వైరస్‌తో సహజీవనం తప్పదు అనే వ్యాఖ్యలు చేస్తున్నాయి. వాటి ఉద్దేశం మన ప్రయత్నాలు వదులుకున్నట్లు కాదు. వ్యాక్సిన్‌ వచ్చే వరకు మన జీవిన శైలిని మార్చుకుని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకుంటే ఇది చాలా ప్రమాదకర వైరస్‌. ఇది పూర్తిగా నయమవుతుందని చెప్పలేం. దీనికి సరైన చికిత్స విధానం లేదు. ఒకవేళ ఉందని ఎవరైనా చెప్తే పూర్తిగా నిరూపించమని అడగండి. ఇంకా కొన్ని మిలియన్ల మంది వైరస్‌ బారిన పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎలాంటి పరిష్కారం లేదు. మన ప్రవర్తనను మార్చుకోవడమే అతి పెద్ద ఉపశమనం. అంటే లాక్‌డౌన్‌ కొనసాగించాలని నా ఉద్దేశం కాదు’ అన్నారు నబారో.

లాక్‌డౌన్‌ ముగించాల్సిందే
‘కొత్త పద్దతులకు అలవాటు పడటానికి జనాలకు కొంత సమయం పడుతుంది. ప్రారంభంలో ఒత్తిడితో కూడుకున్నది. కానీ రాబోయే వారాలు, నెలల్లో మన ప్రవర్తనను సమిష్టిగా మార్చాలి. తద్వారా మనం కరోనా వైరస్‌తో కలిసి జీవించగలము. మన ఆర్థిక వ్యవస్థలను తిరిగి ప్రారంభించగలము. కొన్ని దేశాలు చాలా వేగంగా అన్‌లాక్ చేస్తున్నాయి. అయితే వారు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ వైరస్‌ను ఎవరూ తక్కువ అంచనా వేయకూదు. ప్రారంభంలో, ఇది తేలికపాటి ఫ్లూ లాంటిది అని అభిప్రాయపడిన వ్యక్తులు ఉన్నారు, కాని వాస్తవానికి ఈ వైరస్ ప్రతి రోజు క్రొత్త విషయాలను వెల్లడిస్తోంది. అయితే లాక్‌డౌన్ అనేది వైరస్‌తో పోరాడటానికి మంచి ఆయుధం. వైరస్ ఉన్న చోట సమర్థవంతంగా పని చేస్తుంది. దాని వ్యాప్తిని ఆలస్యం చేస్తుంది. అయితే త్వరగానో లేదా ఆలస్యంగానైనా సరే మీరు లాక్‌డౌన్‌ను ముగించాల్సి ఉంటుంది. ఎందుకంటే లాక్‌డౌన్‌ కొనసాగింపు అనేది ఆర్థిక, సామాజిక అంతరాయాలను కలిగిస్తుంది’ అన్నారు నబారో. అంతేకాక లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని అనుకున్నప్పుడు వైరస్‌ వ్యాప్తిని నిరోధించగల ఏర్పాట్లు చేసిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకోవాలన్నారు. (నలుమూలల్లో మూడు కొత్త వ్యాక్సిన్లు)


భారతీయ విధానం
ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 6 లక్షలు దాటింటి. భారత్‌ కేసుల సంఖ్యలో ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. అన్‌లాక్‌ ప్రారంభించిన నాటి నుంచి దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీని గురించి నబారో​ మాట్లాడుతూ.. భారతదేశంలో ఆరోగ్య సామర్థ్యం చాలా బలంగా ఉందన్నారు. అయితే ఇది ప్రాంతం నుండి ప్రాంతానికి మారుతూ ఉంటుంది. భారతదేశంలో జరుగుతున్న పరీక్షల సంఖ్యను, నమోదవుతున్న కేసులతో పోలిస్తే  అసాధారణమైన విజయమని చెప్పవచ్చు అని ఆయన అన్నారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ సంభవించే అవకాశం ఉందన్నారు నబారో. ప్రపంచవ్యాప్తంగా కదలికలు పెరిగేకొద్దీ, ఈ వైరస్ మళ్లీ వస్తుందన్నారు. సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, యూకే, జర్మనీ దేశాలల్లో ఇప్పటికే సెకండ్‌ వేవ్‌ కొనసాగుతుందని డాక్టర్‌ నబారో తెలిపారు.

మరిన్ని వార్తలు