ఆవు పేడతో అదిరే డ్రస్

17 Sep, 2016 06:34 IST|Sakshi
ఆవు పేడతో అదిరే డ్రస్

ఆవు పేడతో ఇళ్ల ముందు కళ్లాపి చల్లుకోవడం మనకు తెలుసు.. పిడకలు కొట్టి, గోబర్‌గ్యాస్ ప్లాంట్ ద్వారా ఇంధనంగా వాడుకోవడమూ చూసుంటాం. మరి.. ఆవు పేడతో వస్త్రాన్ని తయారు చేయడం మీరెప్పుడైనా చూశారా? ఫొటోలో మోడల్ ధరించింది ఆవుపేడతో తయారైన దుస్తులే అంటే నమ్ముతారా? నమ్మి తీరాలి మరి. ఎందుకంటే నెదర్లాండ్స్‌కు చెందిన డిజైనర్ జలీలీ ఎసాడీ ఆల్రెడీ ఈ పనిచేసేసింది కాబట్టి.  నెదర్లాండ్స్ డెయిరీ ఉత్పత్తులకు పెట్టింది పేరు. ఫలితంగా పాడిపశువుల వ్యర్థాలు ప్రతేడాది పెరిగిపోతున్నాయి. వ్యర్థాలు నీటిలో కలసిపోయి పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.

వీటిని  పరిష్కరించేందుకు ఎసాడీ ప్రతిపాదిస్తున్న వినూత్న మార్గం ఈ పేడ దుస్తులు! కొన్ని రసాయన ప్రక్రియలతో పేడలోని సెల్యులోజ్‌ను వేరుచేసి బయోప్లాస్టిక్, బయో పేపర్, బయో వస్త్రాలుగా మార్చవచ్చని ఎసాడీ నిరూపించింది. ఈ దుస్తులకు ఎసాడీ పెట్టిన పేరు ‘మెస్టిక్’(డచ్ భాషలో పేడను మెస్ట్ అంటారు). ఆవు పేడను ఎరువుగా, ఇంధనంగా వాడటం సమస్యను సగమే పరిష్కరిస్తుందని, వస్త్రాలు తయారు చేస్తే సహజ వనరులను కాపాడుకోవచ్చని అంటున్నారు ఎసాడీ. ఈ ఏడాది జూన్‌లో ఎసాడీ ఎందోవెన్ మున్సిపాలిటీ భాగస్వామ్యంతో మెస్టిక్ వస్త్రాల ఫ్యాషన్ షో కూడా ఏర్పాటు చేశారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు