వారానికి 10 గ్లాసుల వైన్‌ తాగుతున్నారా..?

14 Apr, 2018 15:12 IST|Sakshi

లండన్‌: మందుబాబులు..మీరు వారానికి 10 గ్లాసుల వైన్‌ తాగుతున్నారా..? అయితే ఇక మీ జీవితంలో రెండు ఏళ్ల ఆయుషు తగ్గిపోయినట్లేనని అంటున్నారు కేంబ్రిడ్జి యూనివర్సీటీ పరిశోధకులు. ఇటీవలే వారు మద్యంపై వైద్య పరంగా ఓ విస్తృతమైన పరిశోధన చేశారు. వారి అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ఓ వ్యక్తి వారానికి పది లేదా అంత కంటే ఎక్కువ గ్లాసుల వైన్‌ను సేవిస్తే రెండేళ్ల ఆయుషు తగ్గుతుందని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.  పరిశోధన కోసం19 దేశాలకు చెందిన దాదాపు ఆరు లక్షల మందిని పరిశీలించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 40 ఏళ్ల ఓ వ్యక్తి వారానికి 5 పెగ్గుల మద్యాన్ని సేవిస్తే తన జీవిత కాలంలో ఆరు నెలలు నష్టపోతాడని, 10 గ్లాసుల వైన్‌ తాగితే రెండేళ్లు, 18 గ్లాసులు తాగితే ఐదేళ్ల ఆయుషును కోల్పోతారని యూనివర్సీటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.


యూనివర్సీటీ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎంజెలా వుడ్‌ మాట్లాడుతూ..ఇప్పటికే మద్యం సేవించేవారు తాగడం తగ్గించాలని లేదంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మితిమీరిన మద్యం తాగడం వల్ల లివర్ క్యాన్సర్, రక్త పోటు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. 60 ఏళ్లు దాటిన వారికి మద్యం సేవించడం వల్లే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు పరిశోధనలో తేలిందన్నారు.

మరిన్ని వార్తలు