డ్రోన్లే డెలివరీ బాయ్స్..

11 Apr, 2016 00:23 IST|Sakshi
డ్రోన్లే డెలివరీ బాయ్స్..

న్యూయార్క్: తేనెపట్టులాంటి భవనం.. తేనెటీగలను తలపించే డ్రోన్లు.. సైన్స్ ఫిక్షన్ మూవీని తలపించే ఆకాశహర్మ్యం..  సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఉండే బిల్డింగ్ మాదిరిగా కనిపిస్తున్న ఈ ఆకాశహర్మ్యం ఎత్తు 1,400 అడుగులు(423 మీటర్లు). ఇంతకీ ఈ బిల్డింగ్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా.. వస్తువుల డెలివరీకి.. అలాగే డ్రోన్‌ల డిపోగానూ పనికొస్తుంది. ఈ టవర్ పేరు ‘ద హైవ్’. ప్రస్తుతానికి ఇది ఓ కాన్సెప్ట్ డిజైన్ మాత్రమే. కానీ ఏదో ఒక రోజు వాస్తవ రూపం దాలుస్తుందని దీని రూపకర్తలు చెపుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సుల్వానియాలో చదువుతున్న హదీల్ అయేద్ మహమ్మద్(25), యిఫెంగ్ జావో(24), ఛెంగ్డా జూ(24) అనే ఆర్కిటెక్ట్ విద్యార్థులు తమ యూనివర్సిటీ కోర్సులో భాగం గా ఈ హైవ్ డిజైన్‌ను రూపొందించారు.

న్యూయార్క్ నగరంలోని మన్‌హట్టన్ నడిబొడ్డున ఈ టవర్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. అక్కడ ఉన్న ఒక రెసిడెన్షియల్ టవర్‌ను కాస్తా.. సిటీకి సంబంధించి డ్రోన్ డిపోగా మార్చి నగరానికి మణిహారంగా మార్చాలనేది వీరి ప్రధాన ఉద్దేశం. సమీప భవిష్యత్తులో హైస్పీడ్ డెలీవరీలను చేసేందుకు వీలుగా దీనికి రూపకల్పన చేశారు. అమెజాన్, గూగుల్ ప్రస్తుతం డ్రోన్ డెలివరీ సర్వీసుల కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అమెజాన్ తమ ఉత్పత్తులను 30 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే డెలీవరీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, ఇది ఒక ఏడాదిలోగా అందుబాటులోకి వస్తుందని గత వేసవిలో కాంగ్రెస్‌కు తెలిపింది.

మరోవైపు డ్రోన్ డెలీవరీ సర్వీసులపై ఉన్న నియంత్రణలను త్వరలోనే ఎత్తేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ అవసరాలు.. సమీప భవిష్యత్‌లో అవసరాలు పరిగణనలోకి తీసుకుని ఈ కాన్సెప్ట్ రూపొం దించామని మహమ్మద్ చెప్పారు. వెర్టికల్ హైవే మోడల్‌లో ఈ టవర్‌ను రూపొందిం చామన్నారు. ఈ ప్లాన్‌లో నో ఫ్లై జోన్స్, హైస్పీడ్ ట్రాన్సిట్ ఏరియాలు, లో స్పీడ్ లోకలైజ్డ్ ట్రాఫిక్ మొదలైన ప్లాన్‌లను కూడా పొందుపరిచారు. షేప్, సైజ్ ఆధారంగా తొమ్మిది భిన్నమైన డ్రోన్లు ఈ బిల్డింగ్‌పై నిలిపేలా ఈ కాన్సెప్ట్ రూపొందించారు. ఆర్కిటెక్చర్ మ్యాగజీన్ ఈవోలో నిర్వహించిన వార్షిక ఆకాశహర్మ్యాల కాంపిటీషన్‌లో 489 ఎంట్రీలు పోటీపడగా.. ఈ విద్యార్థులు రూపొందించిన ద హైవ్ కాన్సెప్ట్‌కు సెకండ్ ప్లేస్ దక్కడం విశేషం.

మరిన్ని వార్తలు